Death: తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అక్క మృతి చెందిన విషాద ఘటన తెలంగాణలోని సంస్థాన్‌నారాయణపురం మండలంలోని గుడిమల్కాపురంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మండలంలోని గుడిమల్కాపురం గ్రామానికి చెందిన సయ్యద్ షరీఫ్(20) చౌటుప్పల్‌లో పంక్చర్ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రానికి పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరిగి వస్తూ గుడిమల్కాపురం వంతెన వద్ద అదపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు.
పుర్లకుంట గ్రామానికి చెందిన బంధువు (బాబాయ్ కూతురు వరసకు అక్క) షేక్ ఖాదర్‌బీ(30) తమ్ముడి అంత్యక్రియలకు హాజరై షరీఫ్ మృతదేహంపై పడి బోరున విలపించారు. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక గుండె పోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి ఇద్దరు సంతానం. షరీఫ్ మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా.. ఖాదర్‌బీ మృతదేహాన్ని స్వగ్రామం పుర్లకుంటకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: