Newly married couple commit suicide : క్షణికావేశం నవ దంపతుల ప్రాణాలు బలి తీసుకుంది. ఎన్నెన్నో ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన నలభై రోజుల్లోనే బలవన్మరణాలకు పాల్పడేలా చేసింది. బంధుమిత్రులకు తీవ్ర విషాదం మిగిల్చింది. పోలీసులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లకు చెందిన పొదిలి శ్రీమన్నారాయణ, రమణమ్మ దంపతుల కుమారుడు మహానంది(30). ఇతను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాయ్‌లో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన ప్రియాంక(24)తో గత ఏడాది డిసెంబర్ 28న వివాహమైంది. సంక్రాంతి తర్వాత ప్రియాంకను తన తల్లిదండ్రుల వద్ద ఉంచి విధులకు వెళ్లారు. ఇటీవల కానిస్టేబుళ్ల భర్తీ ప్రకటన విడుదల కావడంతో పరీక్షలకు సిద్ధం కావాలని మహానంది సెల్ఫోన్లో భార్యను కోరారు. ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదని ప్రియాంక తెలిపింది. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు సంభాషణ సాగిందని ఇద్దరి తల్లిదండ్రులు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 4న ప్రియాంక పుట్టింటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న మహానంది.. శనివారం సాయంత్రం విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి బస్సులో ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో ఒంగోలు వచ్చారు.
భార్య లేని జీవితం వద్దంటూ...
ఒంగోలు చేరుకున్న మహానంది తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేనని.. ఇక మీదట మీ దగ్గరకు రానని చెప్పారు. ఆందోళన చెందిన వారు అతనికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అనంతరం ఉదయం 5 గంటల సమయంలో వాసు అనే స్నేహితుడి చరవాణికి తాను గుండ్లకమ్మ జలాశయం దగ్గర ఉన్నానని.. చనిపోతున్నట్టు సంక్షిప్త సందేశం పంపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హుటాహుటిన జలాశయం వద్దకు చేరుకున్నారు. ఒడ్డున మహానంది బ్యాగ్, బూట్లు, సెల్‌ఫోన్, గుర్తింపు కార్డులు, ఫొటోలు ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఒంగోలు, అద్దంకి అగ్నిమాపక సిబ్బంది జలాశయం వద్దకు చేరుకుని బోట్ల సహాయంతో జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం సమయంలో మహానంది మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల వ్యవధిలోనే నవ దంపతులు బలవన్మరణాలకు పాల్పడటంతో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఎస్సై శ్రీరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ముగ్గురు పిల్లలతో కలిసి జూరాల కాల్వలో దూకిన తల్లి