హైదరాబాద్ శివార్లలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. సీలేరు నుంచి పుణెకు 2 టన్నుల గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు నిఘా పెట్టారు. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పెద్ద అంబర్ సమీపంలోని బాహ్యవలయ రహదారి టోల్‌ప్లాజా వద్ద ట్రక్కును తనిఖీ చేశారు. ట్రక్కులో వేయికి పైగా గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. ఒక్కో ప్యాకెట్లో 2 కిలోల గంజాయిని నింపి పెట్టారు.ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు జాగ్రత్తలు తీసుకున్నారు. జీడిపప్పు ముడి సరుకును సంచుల్లో నింపారు. వాటి మధ్యలో గంజాయి ప్యాకెట్లను ఉంచారు. వీటిని పుణె తరలించేందుకు తీసుకెళ్తున్నట్లు ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో తేలింది.
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన నలుగురు నిందితులను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గంజాయి సాగు చేసి, దేశంలోని దిల్లీ, ముంబయి, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, పశ్చిమబంగాల్తో పాటు సముద్ర మార్గం మీదుగా శ్రీలంకకు సరఫరా చేస్తున్నారని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. భౌగోళిక పరిస్థితుల వల్ల పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అక్కడి చేరుకోలేని పరిస్థితులను ఆసరా చేసుకొని స్మగ్లర్లు గంజాయి సాగు చేస్తున్నట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెబుతున్నారు. దేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాలతో పాటు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ అధికంగా గంజాయి సాగు చేస్తున్నారని ఎన్సీబీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: