2017-2019 మధ్య మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 2,859 హత్యకేసులు నమోదయ్యాయి. వీటిలో 1,660 (58.60 శాతం) ఘటనలకు వివాదాలు, వివాహేతర సంబంధాలే కారణాలు. బాధితులుగా మారుతున్న వారిలో ఎక్కువ మంది 18-30 ఏళ్ల వారే.
దగ్గరివారే..
2017-19 మధ్య వివాదాల వల్ల 1,139 మంది హత్యలకు గురయ్యారు. కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, నగదు లావాదేవీల్లో తలెత్తిన విభేదాలు, చిన్నచిన్న గొడవల్లో ప్రత్యర్థులు వారిని హతమార్చారు. వీరిలో 492 మంది (43.19 శాతం) కుటుంబ వివాదాల వల్లే హత్యలకు గురయ్యారు
* పలు ఘటనల్లో హతులు, హంతకులు ఒక కుటుంబానికి చెందినవారే. ఆస్తి తగాదాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా సోదరుల మధ్య ఇలాంటి విభేదాలు అధికమని విశ్లేషిస్తున్నారు.
అడ్డుగా ఉంటున్నారని..
* వివాహేతర సంబంధాల వల్ల మూడేళ్లలో 521 మందిని చంపేశారు. ఏటా ఈ ఒక్క కారణంతో సగటున 17-18 శాతం హత్యలు జరుగుతున్నాయి.
* వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో కొందరు, తమ వైవాహిక జీవితంలోకి ప్రవేశించి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారనే కారణంతో మరికొందరు ఈ హత్యలకు పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారనే అనుమానంతోనూ ఇంకొంతమందిని చంపేస్తున్నారు. ఈ హత్యల్లో అంతమవుతున్న వారిలో ఎక్కువమంది 18-30 ఏళ్లకు చెందినవారే ఉంటున్నారు.
ఇదీ చదవండి: సైబర్ నేరగాళ్ల మోసాల పరంపర... స్కాన్ చేస్తే నగదు మాయం