Naveen Reddy Arrest in Kidnap Case : తెలంగాణలో సంచలనం రేకెత్తించిన హైదరాబాద్ డెంటిస్ట్ వైశాలీ కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన మరో 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే శుక్రవారం రోజున 8 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నవీన్‌రెడ్డి క్రియేట్ చేసిన నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌పై ఆదిభట్ల పీఎస్‌లో కేసు నమోదైంది. అతడితో పాటు రఘుమా రెడ్డి, మరో వ్యక్తిపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు ఆదిభట్ల పోలీసులు వెల్లడించారు. సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ వివరాలు సేకరించిన సీఐ చెప్పారు.
- 'నా బిడ్డ విషయంలో నవీన్‌రెడ్డి మొదటి నుంచీ సైకోగా వ్యవహరించాడు'..
Manneguda Kidnap Case : రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో శుక్రవారం పక్కా ప్రణాళిక ప్రకారం యువతిని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి.. యువతిపై దుష్ప్రచారం చేసేందుకు మొదటి నుంచీ కుట్ర పన్నాడని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. యువతి పేరుతో నకిలీ ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతా క్రియేట్ చేసిన నవీన్ రెడ్డి.. ఆ ఖాతా ద్వారా వాళ్లిద్దరూ దిగిన ఫొటోలను పోస్ట్ చేసినట్లు చెబుతున్నారు. నవీన్ రెడ్డి క్రియేట్ చేసిన ఫేక్ ఇన్‌స్టాగ్రామ్‌పై ఆదిభట్ల పీఎస్‌లో అక్టోబర్ 10న కేసు నమోదు చేసి ఆదిభట్ల సీఐ నరేందర్ దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో ఫేక్ ఇన్‌స్ట్రాగ్రామ్‌కు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారు. నిందితుడు నవీన్ రెడ్డితో పాటు అతనికి సహకరించిన రఘుమారెడ్డి, మరో వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్‌ను నవీన్ రెడ్డి క్రియేట్ చేసినట్లు పూర్తి ఆధారాలు సేకరించారు.
దంత వైద్యురాలికి.. తనకు వివాహమైందని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేసుకున్న నవీన్‌రెడ్డి.. ఎల్బీనగర్ కోర్టులో తన వివాహ విషయమై పిటిషన్ వేశాడు. ఎల్బీనగర్ కోర్టు నుంచి యువతి తండ్రికి నోటీసులు పంపించగా.. నవీన్ దుష్ప్రచారంపై ఎల్బీనగర్ పీఎస్‌లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్ పీఎస్‌కు వెళ్తే అది ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారన్నారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే సరిగ్గా స్పందించలేదని యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ పత్రాలను ఆధారంగా చూయించి కోర్టులో పిటిషన్..: దంత వైద్యురాలి విషయంలో మొదటి నుంచీ నవీన్‌రెడ్డి సైకోగా వ్యవహరించాడని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. బ్యాడ్మింటన్ కోర్టు వద్ద యువతిని నవీన్‌రెడ్డి పరిచయం చేసుకున్నాడని.. ఆ తర్వాత ఆమెని సొంతం చేసుకునేందుకు ఎన్నో డ్రామాలు ఆడాడన్నారు. పెళ్లయినట్లు నమ్మించేందుకు కుట్ర చేశాడని తెలిపారు. ఓ వాహనం కొనుగోలు చేసి అందులో నామినీగా దంత వైద్యురాలి పేరు రాయించిన నవీన్ రెడ్డి.. ఆ పత్రాలను ఆధారంగా చూయించి కోర్టులో పిటిషన్ వేశాడన్నారు. నవీన్ రెడ్డి పెళ్లి విషయంలో అబద్ధం చెబుతున్నాడని.. ఆ సమయంలో దంత వైద్యురాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన బిల్లులు ఉన్నాయని స్పష్టం చేశారు.
నా తలపై రాడ్డుతో కొట్టాడు..: నవీన్‌రెడ్డి, రూబెన్, మరో 50 మంది అనుచరులు శుక్రవారం తన ఇంటిపై దాడి చేశారని యువతి తండ్రి ఆరోపించారు. కారులో ఐరన్ రాడ్లు, రాళ్లు తీసుకొని ఇంటికి వచ్చారన్న ఆయన.. తన కుమార్తె, కుటుంబసభ్యులను చంపాలని ఇంట్లోకి దూసుకొచ్చారని తెలిపారు. నవీన్‌రెడ్డి.. తన తలపై రాడ్డుతో దాడి చేశాడని ఆరోపించారు. తన స్నేహితులు మధ్యలోకి వస్తే వారిపైనా దాడి చేశారన్నారు. దాడి తర్వాత తన కుమార్తెను బలవంతంగా కారులో ఎక్కించుకొని ఎత్తుకెళ్లారని.. ఇంట్లో ఉన్న సామగ్రి, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని తెలిపారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల అదుపులో నవీన్‌రెడ్డి..: యువతి తండ్రి ఫిర్యాదుతో ఆదిభట్ల పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న నవీన్ రెడ్డి, అతని అనుచరులపై ఆదిభట్ల పోలీసులు హత్యాయత్నం, అపహరణ, దాడితో పాటు పలు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నవీన్‌రెడ్డితో పాటు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పరామర్శ..: దంత వైద్యురాలి కుటుంబసభ్యులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా 'కిడ్నాప్ ఘటన దురదృష్టకరం. ఇంటి మీదికి వచ్చి దాడి చేసి కిడ్నాప్ చేయడం హేయమైన చర్య. నవీన్ రెడ్డి చేసిన సైకో ఆలోచన తప్పు. నవీన్ రెడ్డితో పాటు ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిన్న జరిగిన దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. కిడ్నాప్ ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాం. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. సత్వర న్యాయం జరిగేలా చూస్తాం.' అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
- 'నా కొడుకు చేసింది తప్పే కానీ.. అంతకుముందు ఏం జరిగిందంటే'
Naveen Reddy Mother Reaction on dentist kidnap : శుక్రవారం రోజున తమ కుమారుడు నవీన్ రెడ్డి ఆ అమ్మాయి ఇంటిపై దాడి చేయడం.. ఆమెను కిడ్నాప్ చేయడం.. యువతి తండ్రిపై దాడికి దిగడం.. ఇదంతా తప్పేనని నిందితుడి తల్లి నారాయణమ్మ అన్నారు. కానీ పోలీసులు నవీన్ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో దాని వెనక గల కారణాలు తెలుసుకోవాలని అన్నారు. ఈ కిడ్నాప్ వెనుక జరిగిన సంఘటనలు, పరిణామాలపై పోలీసులు దృష్టి సారించాలని నారాయణమ్మ కోరారు.
"నా కొడుకు కష్టపడి సంపాదించాడు. నవీన్, ఆ అమ్మాయి ప్రేమించుకున్నారు. రెండేళ్లుగా కలిసి తిరిగారు. మా ఇంటికి కూడా ఆ అమ్మాయి చాలా సార్లు వచ్చింది. కరోనా సమయంలో ఆమెను రోజు కారులో కళాశాల వద్ద దింపి వచ్చేవాడు. ఆమెను పెళ్లి చేసుకున్నట్లు మా కొడుకు మాకు చెప్పాడు. తన వ్యాపారానికి సంబంధించిన డబ్బులు కూడా ఆ అమ్మాయి తండ్రి దామోదర్ రెడ్డికి ఇచ్చేవాడు. వాళ్ల కోసం కారు కూడా తీసుకున్నాడు. నిన్న ఆ అమ్మాయి ఇంటిపై జరిగిన దాడి తప్పే. కానీ అంతకుముందు జరిగిన విషయాలు కూడా పోలీసులు దృష్టిలో పెట్టుకోవాలి. మా కుమారుడు వ్యాపారం కోసం చాలా కష్టపడేవాడు. ఒక్కోసారి పది రోజులు కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. అంత కష్టపడి పైకి ఎదిగిన నా కుమారుడిని ఆ అమ్మాయి కూడా ఇష్టపడింది. కానీ ఏవో కారణాల వల్ల గొడవలు జరిగాయి. ఆ అమ్మాయిని వదిలేయమని నవీన్‌కు చాలాసార్లు చెప్పాం. మంచి మంచి సంబంధాలు వస్తున్నాయని చెప్పినా వినిపించుకోలేదు."
- నారాయణమ్మ, నవీన్ తల్లి
నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన అతడి తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యారు. తండ్రి కోటిరెడ్డి అస్వస్థతకు గురవడంతో ఆయణ్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. తల్లి నారాయణమ్మ ఆరోగ్యం కూడా పాడైంది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. నిన్న మధ్యాహ్నం ఈ ఘటన గురించి తెలిసినప్పటి నుంచి ఆమె పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. తన కొడుకు అనవసరంగా ఆవేశానికి పోయి ఇలాంటి ఘటనలో ఇరుక్కున్నాడని నారాయణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి :