rape on student in shamirpet : విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే దారి తప్పాడు. విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మాజీ ప్రధానోపాధ్యాయురాలి జోక్యంతో చివరికి ఏడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని(15) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 22న యథావిధిగా బడికి వెళ్లింది. మాస్కు పెట్టుకోలేదనే కారణంతో తన గదిలోకి రావాల్సిందిగా విద్యార్థినిని ఆదేశించిన ప్రధానోపాధ్యాయుడు.. తర్వాత అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించడంతో బాలిక భయపడి తల్లితో సహా ఎవరికీ చెప్పలేదు.
అదే పాఠశాలలో గతంలో పనిచేసిన ప్రధానోపాధ్యాయురాలు బుధవారం కలిసిన సందర్భంలో బాలిక జరిగిన దారుణాన్ని ఆమెతో చెప్పింది. ఆమె ధైర్యం చెప్పడంతో బాలిక, ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించారు. విషయం బయటికి పొక్కడంతో ఓ పార్టీ నేతలు ప్రధానోపాధ్యాయుడికి మద్దతుగా రంగంలోకి దిగారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామంటూ రాజీకి యత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న మరో పార్టీ నాయకులు బాధితులకు మద్దతుగా నిలవడంతో.. బాధితురాలి తల్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ సుధీర్‌కుమార్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:
Rape Attempt: కాపాడాల్సిన పోలీసే.. కాటేయబోయాడు!