Delhi Liquor Scam: దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. ఈడీ అధికారులు హైదరాబాద్‌లో వరుసగా సోదాలు నిర్వహించడమే కాకుండా ప్రముఖ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావును రెండు రోజులుగా తమ కార్యాలయానికి పిలిపించి దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. దిల్లీ మద్యం సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ED Raids In Hyderabad updates : తాజాగా ఈరోజు కూడా వెన్నమనేని శ్రీనివాసరావు సహా మరికొంత మందిని అధికారులు ప్రశ్నించారు. వెన్నమనేనిని సోమవారం ఏడు గంటల పాటు ప్రశ్నించగా... ఆయన ఈ రోజు కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. రెండురోజుల క్రితం ఉప్పల్, మాదాపూర్ లోని రెండు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో సోదాలు నిర్వహించిన అధికారులు వివిధ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. యజమానులకు సంబంధించిన వివరాలు సేకరించారు.
ED Raids In Delhi Liquor Scam : దిల్లీలోని మద్యం కుంభకోణంతో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల్లో లావాదేవీలు లేకున్నా కోట్లలో లాభాలు వస్తున్నట్లు చూపించిన యజమానులు.... డబ్బును హవాలా మార్గంలో ఇతర పనులకు ఉపయోగించినట్లు గుర్తించారు. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి హవాలా మార్గంలో డబ్బులు దిల్లీకి తరలించినట్లు అనుమానిస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాసరావు ఇసుక, మైనింగ్, స్థిరాస్తి వ్యాపారంతో పాటు పలు కంపెనీల్లోనూ డైరెక్టర్‌గా ఉన్నట్లు గుర్తించారు.
నిన్న శ్రీనివాసరావు చరవాణిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవసరమైతే దిల్లీకి రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు శ్రీనివాస్‌రావుకు తెలిపారు. ఈడీ అధికారులు సెల్‌ఫోన్‌ను రామాంతపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించి విశ్లేషించే పనిలో ఉన్నారు.
ఇవీ చదవండి: