కార్వీ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్- ఈడీ (ENFORCEMENT DIRECTORATE INVESTIGATION ON KARVY SCAM) లోతుగా దర్యాప్తు చేస్తోంది. స్టాక్ మార్కెట్ లావాదేవీల నిర్వహణ నెపంతో వినియోగదారులకు సంబంధించిన షేర్లను వారికి తెలియకుండానే బ్యాంకుల్లో తనఖా పెట్టి భారీ మొత్తంలో రుణాలు పొందినట్లు సెబీకి ఫిర్యాదులు రావడంతో మోసం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో బ్యాంకుల తనఖాలో ఉన్న షేర్లను విడిపించి వినియోగదారులకు ఇప్పించేలా సెబీ చర్యలు తీసుకోవడంతో తాము మోసపోయామంటూ పలు బ్యాంకులు.. హైదరాబాద్ సీసీఎస్, సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసులు నమోదయ్యాయి.
నిధుల మళ్లింపుపై లోతైన విచారణ..
ఈ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ (ENFORCEMENT DIRECTORATE) కార్వీ నిర్వాహకుల నిధుల మళ్లింపు అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. వినియోగదారుల షేర్లను అక్రమంగా బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా రుణంగా తీసుకున్న రూ.కోట్ల నిధుల్ని ఎక్కడికి మళ్లించారనే అంశంపై కూపీ లాగుతోంది. ఈ క్రమంలోనే కేఎస్ఎల్ సంస్థ నిర్వాహకుల కనుసన్నల్లో ఉన్న కంపెనీల ఆర్థిక లావాదేవీలను ఆరా తీస్తోంది. మరోవైపు దాదాపు 40 కంపెనీలతోపాటు కొన్ని స్టాక్ ట్రేడింగ్ సంస్థలపైనా ఈడీ కన్నేసింది. ఆయా సంస్థల ఆర్థిక లావాదేవీల గుట్టు తేల్చడంలో నిమగ్నమైంది. మరోవైపు కార్వీ అక్రమాలపై ఇప్పటికే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దర్యాప్తు చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించడంపై ఈడీ దృష్టి సారించినట్లు తెలిసింది.
ఆ వివరాలు దొరికితే..
ఎస్ఎవో ఇప్పటికే కేఎస్ఎల్ ఆధీనంలోని సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి రూ .5 లక్షలకన్నా ఎక్కువగా జరిగిన లావాదేవీల గురించి సమాచారం సేకరించడంతో ఆ వివరాలు తెప్పించుకొనేందుకు ఈడీ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఆ సమాచారం అందితే ఈడీ దర్యాప్తులో కీలక పురోగతి సాధించే అవకాశముంది.
ఏకకాలంలో సోదాలు..
కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ నిర్వాహకుల కార్యాలయాలు, ఇళ్లల్లో ఈడీ బృందాలు బుధవారం ముమ్మరంగా సోదాలు చేశాయి. హైదరాబాద్‌లోపాటు ఇతర నగరాల్లోనూ ఈ సోదాలు సాగాయి.
బెంగళూరు కోర్టు ఉత్తర్వులు రద్దు..
కార్వీ ఛైర్మన్ పార్థసారథిపై పీటీ వారెంట్ ఇస్తూ బెంగళూరు మెట్రోపాలిటన్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. బెంగళూరులో కార్వీ సంస్థపై కేసు నమోదైంది. ఈ కేసులో పార్థసారథిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచడానికి పోలీసులు పీటీ వారెంట్ కోరడంతో దానికి బెంగళూరు మెట్రోపాలిటన్ కోర్టు అంగీకరించింది. పీటీ వారెంట్‌ను తీసుకొని చంచల్‌గూడ జైలుకు వచ్చిన బెంగళూరు పోలీసులకు... పార్థసారథిని అప్పగించడానికి జైలు సూపరింటెండెంట్ నిరాకరించారు. పార్థసారథి అనారోగ్యంగా ఉండటంతో ఇటీవల ఆయనను జైలు సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనకు మూడు రోజుల పాటు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు సూచించారు. దీంతో జైలు సూపరింటెండెంట్.. బెంగళూరు పోలీసులకు పార్థసారథిని అప్పగించలేదు. ఈ అంశంలో పార్థసారథి తరఫు న్యాయవాది.. అవినాష్ దేశాయ్ హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యం కారణంగా పార్థసారథి బెంగళూరు వెళ్లలేరని.... హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బెంగళూరు మెట్రోపాలిటన్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు.. హైకోర్టు రద్దుచేసింది.
ఇదీచూడండి: Facebook Hack Remove: ఫేస్బుక్ ఖాతాలు హ్యాక్.. అశ్లీల వీడియోలతో హల్‌చల్