Wifi Cyber Crime: అంతర్జాల అవసరాలు పెరిగిన ఈ రోజుల్లో.. కొన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వై-ఫై సదుపాయం అందుబాటులో ఉంటోంది. మెట్రో రైల్వే నుంచి విమానాశ్రయం వరకు వివిధ ప్రదేశాల్లో వందలాది మంది దీన్ని వినియోగిస్తుంటారు. అవసరం మాటెలా ఉన్నా.. ఇలా వాడేవారు ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నట్లే.. ఎందుకంటే వై-ఫై నెట్‌వర్క్‌లోకి సైబర్ నేరస్థులు చొరబడుతున్నారు. నెట్‌వర్క్‌లో ఉన్న వారందరి డేటాను తస్కరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబయి నగరాల్లో కొద్దినెలలుగా ఇలాంటి నేరాలు క్రమంగా పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మిడిల్ అటాక్ పద్ధతిలో...
సైబర్ నేరగాళ్లకు భయపడి.. బాధితులు నగదు బదిలీ చేస్తున్నారని, అందుకే ఈ నేరాల తీవ్రత కనిపించడం లేదంటున్నారు.ఉచిత వై-ఫై నెట్‌వర్క్‌లో సైబర్ నేరస్థులు సాధారణ వినియోగదారుల్లాగానే ప్రవేశిస్తున్నారు. మ్యాన్‌ఇన్ మిడిల్ అటాక్ పద్ధతిలో దాడి చేస్తున్నారు. నెట్‌వర్క్‌లోకి వైరస్‌లు.. స్పామ్ వేర్‌లు పంపుతున్నారు. వై-ఫై వినియోగిస్తున్నవారు వారి పనులు చేసుకునే సమయంలో..ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్లు, మెయిల్ చిరునామాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల వివరాలు, పాస్‌వర్డ్‌లు తీసుకుంటున్నారు.
ఈ వివరాల ఆధారంగా యువత, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్, ఫార్మా కంపెనీలు, ప్రైవేటు, కార్పొరేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిని ఎంపిక చేసుకుంటున్నారు. తర్వాత వారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను తెలుసుకుని బాధితులకు తెలియకుండా బ్యాంక్ ఖాతాల్లో ఎంతుంటే అంత నగదు బదిలీ చేసుకుంటున్నారు. విద్యార్థులను బ్లాక్‌మెయిల్ చేసి రూ.వేలు, రూ.లక్షల్లో నగదు వసూలు చేసుకుంటున్నారు.
* ముంబయిలోని ఓ ఫార్మా కంపెనీలో ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తున్న అధికారి కొద్దినెలల కిందట మలాడ్ ప్రాంతంలో ఉచిత వై-ఫై వినియోగించుకున్నారు. సైబర్ నేరస్థుడు ఆయన వివరాలు తెలుసుకుని అతని కంపెనీ ఖాతాలోంచి రూ.44 లక్షలు కాజేశాడు.
* గతేడాది జులైలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌చేసి అల్‌ఖైదా నెట్‌వర్క్ నుంచి మాట్లాడుతున్నాం.. విమానాశ్రయంలో దాడులు చేస్తున్నామన్నాడు. పోలీసులు, సైబర్ నిపుణులు పరిశోధించి.. ఉత్తుత్తి బెదిరింపు కాల్‌గా నిర్ధారించారు.
సురక్షితమైనవైతేనే..
అత్యవసర పరిస్థితులు, అనుకోని అవసరాలతో ఎక్కడైనా వై-ఫై వినియోగించుకోవాలని అనిపించినప్పుడు సురక్షిత నెట్‌వర్క్‌లను ఎంచుకోవాలి. ప్రజలు, ప్రయాణికులను ఆకర్షించేందుకు రెండుమూడేళ్లుగా ఆర్టీసీ బస్టాండ్లు.. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో వై-ఫై సౌకర్యం కల్పిస్తున్నారు. అక్కడి నెట్‌వర్క్‌ను పరిశీలించాలి. మనం వై-ఫైని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు పాస్‌వర్డ్ వచ్చేలా చూసుకోవాలి. అక్కడ కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటివి వాడకూడదు. -నల్లమోతు శ్రీధర్, సైబర్ నిపుణులు
ఇదీ చూడండి: