ఆధునాతన కార్లను తక్కువ ధరకే విక్రయిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను హైదారాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాలుగు చరవాణులు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరో ఇద్దరితో కలిసి దందా:
తెలంగాణాలోని నిజామాబాద్‌కు చెందిన శ్రీకాంత్ ఇసుక వ్యాపారం నిర్వహించి నష్టపోయాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో సైబర్ మోసాలకు తెరతీశాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లి అంకిత్ జైన్, అమన్ పటేల్‌తో స్నేహం పెంచుకున్నాడు. వాళ్ల సాయంతో బినామీ పత్రాలు సమర్పించి సిమ్ కార్డులు తీసుకున్నాడు. ముగ్గురు కలిసి సామాజిక మాధ్యమాల్లో తక్కువ ధరకే అధునాతన కార్లు విక్రయిస్తామంటూ ప్రకటనలు ఇచ్చారు.
డబ్బులు అందగానే ఫోన్ స్విచ్ఛాఫ్:
ఎల్బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి శ్రీకాంత్‌కు ఫోన్ చేసి కారు కొనుగోలు చేయడానికి అతని ఖాతాలో లక్షా 85 వేల రూపాయలు జమ చేశాడు. మరుసటి రోజు నుంచి అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు సాంకేతికత ఆధారంగా నిందితులు భోపాల్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.