ఇల్లు ఖాళీ అయితే.. ‘టు లెట్’ బోర్డు పెడుతుంటారు యజమానులు. మరింత ఎక్కువ మందికి చేరేందుకు వీలుగా ప్రకటనలను డిజిటల్ వేదికలైన 99ఏకర్స్, మ్యాజిక్ బ్రిక్స్, క్వికర్, ఓఎల్‌ఎక్స్, తదితర క్లాసిఫైడ్స్ ప్రకటనల యాప్‌లు, సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా ప్రకటన ఇవ్వడం వల్ల స్పందన భారీగా ఉంటుందన్నది వారి ఆశ. అయితే.. ప్రకటనలు చూసిన మోసగాళ్లు, సంబంధిత నెంబరుకు ఫోన్ చేస్తున్నారు. అద్దె, అడ్వాన్స్ గురించి మాట్లాడుకున్నాక, డబ్బును యాప్ ద్వారా పంపుతున్నామని నమ్మబలుకుతూ, యజమాని ఖాతా నుంచే సొమ్మ మాయం చేస్తున్నారు. ఇలా కొత్త ఎత్తుగడలతో ఏమాత్రం అనుమానం రాకుండా అందినకాడికి దోచుకుంటున్నారు. గత తొమ్మిది నెలల కాలంలో నగరంలో దాదాపు 15 వరకు ఈ తరహా మోసాలు చోటుచేసుకున్నాయి.
నమ్మించి కొట్టేస్తున్నారు
కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. ఓ సైట్‌లో తన ఇంటిని అద్దెకు ఇస్తున్నట్లు, ఆసక్తి ఉన్న వారు సంప్రదించవచ్చని ఫోన్ నెంబరు ఇచ్చారు. ఓ వ్యక్తి ఫోన్ చేసి, తమ కుటుంబం ఆ ఇంట్లో అద్దెకు దిగుతామని చెప్పాడు. అడ్వాన్స్ మొత్తాన్ని యూపీఐ యాప్ ద్వారా రూ. 40 వేలు పంపుతున్నానని, తాను క్యూఆర్ కోడ్ పంపుతున్నట్లు.. దానిని స్కాన్ చేయాలని చెప్పాడు. నిజమే అని నమ్మిన ఆమె, తన ఫోన్‌కు వచ్చిన ఆ కోడ్‌ను స్కాన్ చేసింది. అంతే.. ఆమె ఖాతా నుంచి ఆమేరకు నగదు మాయం అయింది.
తన ఇంటిని అద్దెకు ఇస్తానని, విజయవాడ నగర శివారు ప్రసాదంపాడు గ్రామానికి చెందిన మహిళ ఓ యాప్‌లో ప్రకటన ఇచ్చారు. దీనికి స్పందనగా ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను బీఎస్‌ఎఫ్ ఉద్యోగినని, గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తానని చెప్పుకొచ్చాడు. ఇంట్లో అద్దెకు దిగుతానని, ముందుగా రూ. 5 వెల్లు అడ్వాన్స్‌ను గూగుల్ పే ద్వారా పంపుతున్నట్లు చెప్పాడు. గుర్తు తెలియని వ్యక్తి తన గూగుల్ పే ఖాతాకు పంపిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడంతో.. అంత మొత్తం పోయింది.
నగరానికి చెందిన వ్యక్తి తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఓ యాప్‌లో ప్రకటన పోస్ట్ చేశాడు. ఇది చూసి.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. రెండు నెలల అద్దె మొత్తాన్ని గూగుల్ పే ద్వారా రూ. 65 వెల్లు పంపుతున్నట్లు చెప్పాడు. దీంతో నిజమే అని నమ్మి.. తన ఫోన్‌కు వచ్చిన రిక్వెస్ట్‌పై క్లిక్ చేశాడు. ఫిర్యాదుదారుడి బ్యాంకు ఖాతా నుంచి ఈ మొత్తం బదిలీ అయింది.
పంపుతున్నామంటూ.. లాగేస్తున్నారు
* అవసరం ఏదైనా, టక్కున జేబులోని మొబైల్ తీసి బిల్లు చెల్లించడం ఇటీవలి కాలంలో సర్వ సాధారణమైంది. పెద్ద నోట్ల రద్దుతో పెరిగిన ఈ ధోరణి.. కొవిడ్‌తో గరిష్ఠ స్థాయికి చేరింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు పలు యాప్‌లు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. వీటిని కేటుగాళ్లు తమ మోసాలకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు.
* మీకు డబ్బు పంపుతున్నామంటూ వాట్సాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను మోసగాళ్లు పంపుతున్నారు. దీనిని స్కాన్ చేస్తే నగదు, మీ ఖాతాలో జమ అవుతుందని నమ్మిస్తున్నారు. తీరా స్కాన్ చేస్తే.. ఆ మేరకు డబ్బు ఖాతా నుంచి డెబిట్ అవుతోంది. కొన్ని యూపీఐ యాప్స్‌లో ఉండే ఈ సదుపాయాన్ని కూడా మోసాలకు ఉపయోగిస్తున్నారు.
* చెల్లింపు యాప్‌ల్లో ఉండే ‘రిక్వెస్ట్’ అనే ఫీచర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనకు డబ్బు పంపించాల్సిన వ్యక్తికి దీనిని పంపుతూ, కావాల్సిన మొత్తాన్ని ఇందులో నమోదు చేస్తాం. అవతలి వ్యక్తి క్లిక్ చేయగానే అంత మేర నగదు, వారి ఖాతా నుంచి పంపిన వారికి జమ అవుతుంది. దీని గురించి తెలియని వారికి, తమకు అంత మొత్తం డబ్బు పంపుతున్నారేమో అని రిక్వెస్ట్‌ను అంగీకరిస్తూ క్లిక్ చేస్తారు. దీని వల్ల నగదు పోతుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి మోసగాళ్లు, ఇంటి యజమానులను బురిడీ కొట్టిస్తున్నారు.
ఇదీ చదవండి: పోలీస్ కానిస్టేబుల్ బెదిరింపుల వల్ల వ్యక్తి మృతి