రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణను వేగవంతం చేసిన సీబీఐ అధికారులు.. 39వ రోజు నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, అతని సోదరుడు సిద్ధారెడ్డితో పాటు మరో ఇద్దరు అనుమానితుల్ని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు రెండు వారాల నుంచి ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరిని వరసగా విచారిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివేకా హత్య జరగడానికి ఆరు నెలల ముందు దస్తగిరి పని మానేశాడు. ఇతడు ఇచ్చిన కొన్ని కీలక ఆధారాలతో గత నెలరోజుల నుంచి సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారనే కేసులో రెండేళ్ల కిందట ఎర్ర గంగిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిలుపైన ఉన్న వీరిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఘటన రోజు ఏం జరిగిందన్న విషయంపై.. మరింత స్పష్టత వచ్చే దిశగా కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
విచారణలో దూకుడు..
వివేకా హత్య కేసును సవాలుగా తీసుకున్న సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. గత 39 రోజులుగా పలువురు అనుమానితులను విచారించారు. ఈ కేసులో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురికాగా.. మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సేకరించి ఆ దిశగా విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: