వారంతా మిత్రులు. డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కుటుంబాలు సైతం వారిపైనే ఆశలు పెట్టుకున్నాయి. అంతా సానుకూలంగా ఉందనుకుంటున్న తరుణంలో విధి వక్రించింది. సరదాగా చేపల వేటకు వెళ్లిన నలుగురు మిత్రుల్లో ముగ్గురిని బురద ఊబి మింగేసింది. ఆ ఇళ్లలో వేదన మిగిల్చింది. రాజుబంగారుపాలేనికి చెందిన కొనసం దుర్గారెడ్డి (25), చినగంజాం రైల్వేస్టేషన్ కూడలికి చెందిన కోకి కాశీరెడ్డి (24), మూలగాని గోపీరెడ్డి, వేటపాలెం మండలం కొత్తరెడ్డిపాలేనికి చెందిన నంగు రమణారెడ్డి (24) మిత్రులు. రక్షణ రంగంలో ఉద్యోగాలపై దృష్టి సారించి రోజూ సాధన సాగిస్తున్నారు.
సరదాగా కలిసి వెళ్లి..
శుక్రవారం సాయంత్రం ఆటవిడుపుగా మిత్ర బృందం చేపల వేటకు వెళ్లారు. అమీన్‌నగర్ రైల్వే వంతెన వద్ద రొంపేరు కాలువలో దిగారు. ఓ వైపు గోపీరెడ్డి ఉండగా... మిగతా ముగ్గురూ మరోవైపు ఉండి వల విసిరారు. కాసేపయ్యాక ఆ వలను లాగుతూ ముగ్గురూ కాలువ మధ్యలోకి వచ్చారు. అక్కడ ఊబి ఉన్న విషయం తెలియని దుర్గారెడ్డి అడుగు వేసి అందులో కూరుకుపోయాడు. బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరయ్యాడు. సమీపంలోనే ఉన్న కాశీరెడ్డి గుర్తించి రక్షించేందుకు వెళ్లి తనూ చిక్కుకుపోయాడు. వారిద్దరి పరిస్థితి గమనించిన రమణారెడ్డి... మిత్రులను కాపాడే ప్రయత్నంలో ఊబిలో తానూ కూరుకుపోయి బయటకు రాలేకపోయాడు. అవతలి వైపున ఉన్న గోపీరెడ్డి... ప్రమాదాన్ని గుర్తించి వచ్చేలోపే ముగ్గురూ గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఇద్దరి, మరో గంట తర్వాత మరొకరి మృతదేహం లభ్యమయ్యాయి. ప్రమాద విషయం తెలిసిన సమీప గ్రామాల వారు వందలాదిగా అక్కడకు చేరుకున్నారు. ఘటనా స్థలంలో బాధితుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. చినగంజాం ఎస్సై పి.అంకమ్మరావు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
తల్లడిల్లిన కుటుంబాలు
* కొత్తరెడ్డిపాలేనికి చెందిన రమణారెడ్డిది వ్యవసాయ కుటుంబం. తండ్రి నంగు శ్రీనివాసరెడ్డి. తల్లి ఉమాదేవి పుల్లరిపాలెం పంచాయతీ పరిధిలో అంగన్వాడీ టీచరుగా పనిచేస్తున్నారు. రమణారెడ్డి ఇటీవలే ఎస్‌ఎస్‌బీ పోటీ పరీక్షలు రాసి సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండిస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చినగంజాంలోని బంధువుల ఇంట్లో ఉంటూ మరికొన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అతడి మృతితో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
* రాజుబంగారుపాలేనికి చెందిన దుర్గారెడ్డిది మరింత విషాదం. తండ్రి మస్తాన్‌రెడ్డి చనిపోయారు. తల్లి పేరు అంకమ్మ. రెండేళ్ల క్రితమే దుర్గారెడ్డికి వివాహమైంది. వీరికి ఏడాది పాప ఉంది. ఆయన రెక్కల కష్టంపైనే కుటుంబం బతుకుతోంది. ఇప్పుడు చనిపోవడంతో అందరూ రోడ్డున పడ్డారు. ఇక మాకు దిక్కెవరంటూ భార్య, తల్లి రోదిస్తున్న తీరు అక్కడి వారిని కలచివేసింది. అందరితోనూ కలవిడిగా ఉండే వ్యక్తి అని గ్రామస్థులు తెలిపారు.
* చినగంజాం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కోకి అంజిరెడ్డికి ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు కాశీరెడ్డి ఉన్నాడు. అంజిరెడ్డి రెండు నెలల క్రితమే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
ఇదీ చదవండి: ముంచుకొస్తున్న తౌక్టే.. రాయలసీమకు భారీ వర్ష సూచన