AP Today Crime: విశాఖ జిల్లా సీతారాంపురం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పాడేరు ఏజెన్సీ పెదబయలులో ఆంధ్రా - ఒడిశా సరిహద్దు మత్స్యగెడ్డ వంతెన వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో 12 మందికి గాయాలయ్యాయి.
ఉరివేసుకుని యువతి ఆత్మహత్య: గుంటూరు జిల్లా తెనాలి పెదరావూరులో విషాదం చోటుచేసుకుంది. శ్రీలత(17) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి పరిశీలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గతంలో రావూరి ఎఫ్రాయిన్(22) అనే యువకుడు, శ్రీలత ప్రేమించుకున్నారని.. రెండు నెలల క్రితం ఎఫ్రాయిన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో శ్రీలత వల్లే తమ బిడ్డ చనిపోయాడని అతడి కుటుంబసభ్యులు ఆరోపించినట్లు చెప్పారు. శ్రీలత ఆత్మహత్య చేసుకోవటానికి కారణాన్ని లెటర్లో రాసినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు పూర్తి దర్యాప్తు కోసం ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీలత తల్లి డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది.
ప్రభుత్వాస్పత్రిలో వృద్ధురాలు మృతి..: గుంటూరు జిల్లా మాచర్లలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మరణించింది. స్థానిక 20వ వార్డుకు చెందిన కొమ్ము అన్నమ్మ (70) అనారోగ్యం కారణంగా ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. డ్యూటీలో ఉన్న వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వైద్యం అందక.. అందరూ చూస్తుండగానే ఆమె ప్రాణాలు విడిచింది. మృతురాలి బంధువులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వాస్పత్రిలో పేదలకు వైద్యం అందించకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సూపరిటెండెంట్ రంగారావుకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు.
ఆస్పత్రిలో బాలింత మృతి..: విశాఖ జిల్లా ఎలమంచిలి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్షానికి ఓ బాలింత మృతి చెందింది. ఆస్పత్రి ఎదుట మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆసుపత్రి వద్ద పోలీసులను మోహరించారు. ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కుక్కలపల్లి గ్రామానికి చెందిన గంజి భవానికి తొలి కాన్పు కావడంతో ఆమెను సోమవారం ఎలమంచిలి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. నార్మల్ డెలివరీ కాకపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం బాలింతను పట్టించుకోకపోవడంతో ఆమె రాత్రి మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని వైద్యురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిండు గర్భిణీ మృతి.. ఆందోళనలో కుటుంబ సభ్యులు: ప్రసవం కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ గర్భిణి కడుపులోని బిడ్డతో సహా మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో చోటుచేసుకుంది. పట్టణంలోని పార్వతినగర్లో నివాసముంటున్న వేల్పుల రామాంజనేయులు భార్య శారద (26)కు సోమవారం పురిటి నొప్పులు ప్రారంభమై అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విధుల్లో ఉన్న వైద్యురాలు జోత్స్న ఆమెను పరిశీలించి.. అప్పటికే కడుపులోని బిడ్డతో సహా మృతి చెందినట్లు దృవీకరించారు. తల్లీబిడ్డ మృతితో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. మృతురాలికీ ఐదేళ్ల పాప ఉందని బంధువులు తెలిపారు.
ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి: విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం జాతీయ రహదారి వద్ద ప్రమాదం జరిగింది. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అధిక వేగంతో అదుపుతప్పి ఆగిఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు విజయనగరం జిల్లా పోసరేగొండపాలానికి చెందిన చైతన్యగా పోలీసులు గుర్తించారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గుర్తుతెలియని మృతదేహం: విశాఖ పాడేరు ఏజెన్సీ పెదబయలులో ఆంధ్రా - ఒడిశా సరిహద్దు మత్స్యగెడ్డ వంతెన వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అది ఒడిశా నీటి భాగమని ఆంధ్రా అధికారులు తెలిపారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మృతదేహాన్ని ఒడ్డునే ఉంచారు. ఎవరూ రాకపోవడంతో ఒడిశాకు చెందిన పాతలంగి సర్పంచ్ ఆకాష్ కుమార్కు మృతదేహాన్ని అప్పగించారు. మత్స్యగెడ్డ సమీపంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
భర్త రెండో పెళ్లిపై మొదటి భార్య ఆందోళన..: భర్త రెండో పెళ్లి చేసుకున్నాడంటూ మొదటి భార్య ఆందోళనకు దిగిన ఘటన అనంతపురం జిల్లాలో వివాదంగా మారింది. కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన మహబూబ్ బీకి ఆళ్లగడ్డ మండలానికి చెందిన నాగరాజుకు 6 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల పాప కూడా ఉంది. వీరిద్దరి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇదే విషయంపై కోర్టులో కేసు కూడా నడుస్తున్నట్లు బాధితురాలు మహబూబ్ బి చెబుతోంది.
ఈ క్రమంలో నిందితుడు నాగరాజు మరో యువతిని వివాహం చేసుకున్నాడు. నగరంలోని ఎస్ఆర్ గ్రౌండ్ హోటల్లో నిందితుడు రిసెప్షన్లో పని చేసుకుంటుండగా విషయం తెలుసుకున్న మహబూబ్ బి తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుంది. అప్పటికే వివాహం కావడంతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. తన మొదటి భార్యకు తలాక్ చెప్పిన తర్వాతనే రెండో వివాహం చేసుకున్నానని నిందితుడు నాగరాజు చెబుతున్నాడు. కానీ తలాక్ కి మహబూబ్ బి అంగీకరించలేదని చెబుతోంది.
ఆటో - ట్రాక్టర్ ఢీ.. పదిమందికి గాయాలు: శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు కోటబొమ్మాళి మండలానికి చెందిన భవన నిర్మాణ కార్మికులుగా పోలీసులు గుర్తించారు.
బస్సు-బైకు ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు: నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద ఎస్ఆర్జేడీ డిగ్రీ కళాశాలకు చెందిన బస్సు.. బైకును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: అమానుషం.. కన్నకూతురిపై మూడేళ్లుగా తండ్రి అత్యాచారం