YSRC MP's in Parliament: విశాఖ రైల్వే జోన్‌పై వైకాపా ఎంపీలు లోక్‌సభలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గురువారం శూన్యగంటలో ఈ అంశంపై అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌లు వేర్వేరుగా మాట్లాడారు. జోన్ మంజూరు చేయడంతోపాటు, దానికి రూ.300 కోట్లు కేటాయించినందుకు సత్యవతి ధన్యవాదాలు తెలపగా.. అసలు జోన్ అమల్లోకి వస్తుందా? రాదా? అన్న అమోయయం రాష్ట్ర ప్రజల్లో నెలకొందని ఎంపీ భరత్ పేర్కొన్నారు.
MP Satyavathi On visakhapatnam railway zone: ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాలిక పెండింగ్ డిమాండు. జోన్ మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖకు ధన్యవాదాలు చెబుతున్నా. ఇటీవల కాలంలో ప్రత్యేక అధికారిని నియమించడంతోపాటు, జోనల్ కార్యకలాపాల కోసం రూ.300 కోట్లు కేటాయించారు. ఇదే సమయంలో నేను చిన్న డిమాండు చేస్తున్నా. విశాఖ కేంద్రంగా పని చేస్తూ దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించే డివిజన్లలో 5వ స్థానంలో ఉన్న వాల్తేర్ డివిజన్‌ను విశాఖ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు తరలించడం వల్ల భద్రత, నిర్వహణలపై పర్యవేక్షణ తగ్గుతుంది. వాల్తేర్ డివిజన్‌ను యథాతథంగా ఉంచి రాయగడ డివిజన్‌తో దాని సరిహద్దులను ఖరారు చేయాలి. ఈ విషయంలో ఏపీ ప్రజల సెంటిమెంట్లనూ పరిగణనలోకి తీసుకోవాలి’ అని సత్యవతి కోరారు.
mp bharath on visakhapatnam railway zone: ‘రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు దాటింది. అప్పట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు గురించి వాగ్దానం ఇచ్చినా అమలు చేయలేదు. ఇంతకుముందు మాట్లాడినవారు (తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు) చెప్పినట్లు 2021-22 బడ్జెట్‌లో ఈ జోన్ కోసం రూ.40 లక్షలే కేటాయించారు. కానీ దక్షిణ కోస్తా జోన్‌ను ఏర్పాటు చేస్తారా? లేదా? అన్న తీవ్రమైన అయోమయం, సందిగ్ధత ఏపీ ప్రజల్లో నెలకొంది. దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రజల తరఫున డిమాండు చేస్తున్నాం. రైల్వే మంత్రి సభాముఖంగా జోన్‌పై స్పష్టత ఇవ్వాలి’ అని భరత్ కోరారు.
రైల్వే జోన్‌ను వెంటనే ప్రారంభించాలి: తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు
MP RamMohan naidu on Railway Zone: దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన కొత్త జోన్ ఏర్పాటుపై ఇప్పటికీ పురోగతిలేదని లోక్‌సభలో గళమెత్తారు. మూడేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవచూపడంలేదని మండిపడ్డారు. 2021-22 బడ్జెట్‌లో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు కేవలం రూ.40 లక్షలు మాత్రమే కేటాయించారు.. ఆ డబ్బుతో భవనం నిర్మించడమే కష్టమన్నారు. ఇంత తక్కువ కేటాయించడం రాష్ట్రాన్ని అవమానించడమేనన్నారు.
MP Rammohan addressing South Coast Railway Zone at LokSabha: దేశంలో ప్రస్తుతం ఉన్న రైల్వే జోన్ల జాబితాలో గానీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే జోన్ల జాబితాలో గానీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశాన్ని కేంద్రం చేర్చలేదని మండిపడ్డారు. ఈ రెండు జాబితాలోనూ లేకపోవడంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు, ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో చెప్పాలని, ఏపీ ప్రజల తరఫున మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: