బిల్లుల మంజూరుపై దృష్టి
గత ఎఫ్‌ఆర్‌వో హయాంలో జరిగిన పనుల్లో అవకతవకలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. ఇటీవల సంబంధిత అధికారులు సందేహాలు నివృత్తి చేసుకునేందుకు కొన్ని ప్రశ్నలతో కూడిన నోట్‌ను వీఎంఆర్‌డీఏ అధికారులకు పంపించారు. ‘హరిత విశాఖ’ ప్రాజెక్టులో అక్రమాలు వాస్తవమేనని ఈఈలతో కూడిన కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఎఫ్‌ఆర్‌వోను ఏడాదిపాటు కొనసాగించడం... ఆ తరువాత కిందిస్థాయి అధికారులైన డీఈలతో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకున్న అంశాలపైనా విజిలెన్స్ శాఖ దృష్టిసారించినట్లు సమాచారం. వీటితో పాటు ఇష్టానుసారం బిల్లుల మంజూరు విషయంపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అధికారులు తీరు విస్తుగొలుపుతోంది. అటవీ విభాగంలో ఎఫ్‌ఆర్‌వో(ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్) నియామకమే ఇందుకు తార్కాణం. నిబంధనల ప్రకారం వ్యవసాయశాఖకు చెందిన అధికారులకు వీఎంఆర్‌డీఏలో ఎటువంటి పోస్టు లేదు. అయితే ఆ శాఖకు చెందిన ఉద్యోగులను మళ్లీమళ్లీ తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి ఎఫ్‌ఆర్‌వోగా చేసే అధికారి ఉద్యానవన, అటవీశాఖకు చెందిన వారై ఉండాలి. ఈ కారణంగానే గతంలో ఎఫ్‌ఆర్‌వోగా చేసిన అధికారి పలు తప్పిదాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట వ్యవసాయ శాఖ నుంచి డిప్యుటేషన్ మీదొచ్చిన శ్యామ్‌ప్రసాద్‌కు వీఎంఆర్‌డీఏలో పోస్టు లేదని వీఎంఆర్‌డీఏ కమిషనర్ కోటేశ్వరరావు గత నెలలో మాతృశాఖకు అప్పగించారు. అదే ఎఫ్‌ఆర్‌వో స్థానానికి మళ్లీ వ్యవసాయశాఖ నుంచి వచ్చిన మరో అధికారిని నియమించుకోవడం గమనార్హం. ప్రస్తుతం వీఎంఆర్‌డీఏలో ఇది చర్చనీయాంశమయింది.
ఇదీ చదవండి: ఫిబ్రవరిలోనే కొవాగ్జిన్: ఐసీఎంఆర్