విశాఖ ముడసర్లోవ పార్క్‌ను ఆనుకుని.. కొండలు, నీటికుంటల మధ్య ఉన్న గోల్ఫ్ కోర్ట్‌లో.. మహిళలు చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. సరదాగా నేర్చుకున్న ఆటలో నిష్ణాతులుగా రాణిస్తున్నారు. విశాఖ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. ఇందులో నావికా ఉద్యోగులు, దేశవిదేశాలతో ఆడే క్రీడాకారులు ఆడుతుంటారు. మొత్తం 18 చిన్న మైదానాలతో ఉండే ఈ కోర్ట్‌లో.. ఆటను నేర్పే అకాడమీ ఉంది. వారు మహిళలు, చిన్నారులనూ ప్రోత్సహించటంతో.. జాతీయస్థాయిలో సత్తా చాటేలా రాణిస్తున్నారు.
భర్తతో కలసి సరదాగా ఆటను ప్రారంభించిన మహిళలు.. అనతికాలంలోనే పట్టుసాధించారు. వేకువజామునే లేచి.. ఇంట్లో పనులు పూర్తిచేసి సాధనచేస్తున్నామన్నారు. ఆసక్తితోపాటు.. కుటుంబ ప్రోత్సాహం ఉంటేనా ఈ క్రీడలో రాణించగలమని క్రీడాకారిణులు చెబుతున్నారు.
విశాఖ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. నేవీ, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. సహజ సిద్దమైన ప్రకృతి మధ్యలో ఉన్న మైదానం.. ప్రపంచస్థాయి గుర్తింపు పొందిందని నిర్వాహకులు చెప్పారు.
ఇప్పటివరకూ 20 మంది మహిళా క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొంది జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చారు. మరో 30 మంది చిన్నారులూ రాణిస్తున్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయస్థాయిలో మహిళా గోల్ఫ్ క్రీడాకారులు విజయాలు సాధిస్తారని క్లబ్ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఇవాళ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్