విషవాయువును పీల్చి అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఇతర వ్యాధులు చుట్టు ముడుతున్నాయి. ఆర్‌ఆర్ వెంకటాపురానికి చెందిన ఆకుల రామలక్ష్మికి భుజంపై గురువారం నుంచే దురదగా ఉంది. శుక్రవారం ఉదయానికి మంట పుట్టి.. చర్మం కమిలిపోయి బొబ్బలు రావడంతో చర్మ విభాగ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చాలామంది తమకు ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. బాధితులందరికీ కిడ్నీలు, కాలేయ పనితీరు నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వాటి నివేదికలు రావల్సిఉంది.
ప్రమాదం జరిగిన 48 గంటల తర్వాత కొత్త ఇబ్బందులు రావొచ్చని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ తరహా కేసులు ఇంతవరకు రాలేదని, ఒకేసారి వందల సంఖ్యలో అస్వస్థతకు గురికావడం, లేవలేని స్థితిలో ఆసుపత్రులకు రావడం వల్ల పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయాలని వైద్యులు అంటున్నారు. 5ఏళ్ల మణిదీప్ ఇప్పటికీ కళ్ళు తెరవలేకపోతున్నాడు. ఇదే ప్రమాదంలో మణిదీప్ తండ్రి గోవిందరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే చనిపోయారు. మణిదీప్ కళ్ళకు చికిత్స చేయించేందుకు ఇవాళ వైద్యులు ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని చెబుతున్నారు.
ఒళ్ళంతా నొప్పిగా మంటగా ఉందని.. చికిత్స పొందుతున్న చిన్నారులు, మహిళలు చెబుతున్నారు. ఒంటిపై దద్దుర్లు, కమిలిపోవడం వంటి లక్షణాలు ఉన్న వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో యువకులు, చిన్నారులు, మహిళలు ఉన్నారు.
ఇదీ చదవండి: