సింహాచలం, మాన్సాస్ భూముల విచారణ కమిటీలో కీలకంగా వ్యవహరించిన దేవాదాయ శాఖ విశాఖ ఉప కమిషనర్ పుష్పవర్ధన్ రాజీనామా చేశారు. రెండు వారాల కిందట ఆ పోస్టు నుంచి తప్పించగా.. తాజాగా ఆయన కమిషనర్‌కు రాజీనామా లేఖ పంపడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. పుష్పవర్ధన్ విశాఖ ఇన్‌ఛార్జ్ ఉప కమిషనర్‌గా జూన్ 27న బాధ్యతలు చేపట్టారు. తర్వాత సింహాచలం, మాన్సాస్ భూములపై కమిషనర్ విచారణకు ఆదేశించారు. అదనపు కమిషనర్ చంద్రకుమార్, దుర్గగుడి ఈవో భ్రమరాంబ, విశాఖ డీసీ పుష్పవర్ధన్‌లకు ఆ బాధ్యత అప్పగించారు. ఇందులో పుష్పవర్ధన్ అంతా తానై వ్యవహరించారు. చివరకు సింహాచలం ఆలయ భూముల రిజిస్టర్ నుంచి కొన్ని భూములు తొలగించారంటూ వీరు ప్రాథమిక నివేదిక అందజేశారు. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అయితే అనూహ్యంగా పుష్పవర్ధన్‌పై వేటు వేయడం అందరినీ ఆశ్చర్యపరచింది.
ఏసీతో వివాదమని చెబుతున్నా..
మనస్పర్థల కారణంగా విశాఖ సహాయ కమిషనర్ శాంతి ఆగస్టు 5న ఇసుక తెచ్చి పుష్పవర్ధన్‌పై చల్లారు. దీనిపై కాకినాడ ఆర్‌జేసీ విచారణ జరిపి, శాంతిదే తప్పని నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. అయినా పుష్పవర్ధన్‌ను విశాఖ డీసీ పోస్టు నుంచి తప్పించారు. అప్పటి నుంచి పుష్పవర్ధన్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయలేదు. తాజాగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఏసీ శాంతితో వివాదం కారణంగా ఆయన్ను విశాఖ నుంచి తప్పించలేదని, దీనివెనుక మరో కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. సింహాచలం ఆలయ రిజిస్టర్ నుంచి తొలగించారని చెబుతున్న భూముల్లో.. గతంలో భూముల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) చేసుకున్నవారు ఆందోళన చెందక్కర్లేదని, నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌వోసీ) కోసం కమిషనర్‌కు దరఖాస్తు చేసుకొని ఉపశమనం పొందవచ్చని పుష్పవర్ధన్ పేర్కొన్నట్లు కొన్ని పత్రికల్లో వచ్చింది. అంటే సింహాచలం భూముల్లో.. ఎల్‌ఆర్‌సీకి చెందినవి, వివిధ సంస్థలకు అధికారికంగా కేటాయించినవి తదితరాలను నిబంధనల ప్రకారమే గత అధికారులు రిజిస్టర్ నుంచి తొలగించారనే వాదన తెరపైకి వచ్చింది. ఇది నచ్చని కొందరు ఆయన్ను బదిలీ చేయించారని ప్రచారం జరుగుతోంది.
కోర్టును ఆశ్రయించిన అదనపు కమిషనర్: సింహాచలం భూముల వ్యవహారంలో ఆగస్టు 6న సస్పెండైన.. గతంలో ఆలయ ఈవోగా పనిచేసి, ఇప్పుడు అదనపు కమిషనర్‌గా ఉన్న రామచంద్రమోహన్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ ఈవోలు, విశాఖ కలెక్టర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి