JAC leaders meeting: మూడు రాజధానులకు మద్దతుగాా.. విశాఖ గర్జన పేరిట ఈ నెల 15న ర్యాలీ చేపట్టాలని, రాజకీయేతర ఐకాస నిర్ణయించినట్లు.. మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని.. వికేంద్రీకరణ, విశాఖ రాజధాని ఆకాంక్షను చాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. విశాఖలో రాజకీయేతర ఐకాస నిర్వహించిన సమావేశానికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌తోపాటు వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
విశాఖను రాజధానిగా కోరుకునే హక్కు విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలకు ఉందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వికేంద్రీకరణ ఉద్యమానికి అవసరమైతే రాజీనామాకు సిద్ధమని స్పష్టంచేశారు. ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఒక అడుగు ముందుకేసి.. రాజీనామా లేఖను ఐకాస కన్వీనర్‌కు అందజేశారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాజధానుల అంశంపై ఉపఎన్నికకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు.. సీఎం అంగీకరిస్తే పదవికి రాజీనామా చేసి వికేంద్రీకరణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని చెప్పారు. అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎమ్మెల్యే గణేశ్ నడుపుతున్న బైక్‌ను మరో బైక్ ఢీకొట్టడంతో ఆయన కాలికి గాయమైంది. ఎమ్మెల్యేను విశాఖ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: