సాగర నగరమైన విశాఖలో బుద్ధుడు తప్పస్సు చేసి...తీర్థంకరులతో మాట్లాడిన ప్రాంతంగా తొట్లకొండకు విశిష్టత ఉంది. బుద్ధుడు ఉన్న ప్రాంతం కనుకే విశాఖ అనే పేరు వచ్చిందని భక్తుల నమ్మకం. పవిత్ర పుణ్య ప్రాంతంగా పేరొందిన అలాంటి తొట్లకొండలో ప్రభుత్వ అతిథి గృహం వివాదానికి దారి తీస్తోంది. విశాఖలో ఎన్నో కొండలు ఉన్నా.... తొట్ల కొండలోనే ఈ నిర్మాణం చేపట్టాలా అని బౌద్ధ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కువమంది ఆరాధించే బుద్ధ భగవాన్‌పై ప్రభుత్వం చూపించే గౌరవం ఇదేనా అని నిలదీస్తున్నాయి.
ఉద్యమం తప్పదు...
శాంతి, ప్రేమకు నెలవైన తొట్ల కొండల్లో ఎలాంటి నిర్మాణం చేపట్టవద్దని బౌద్ధ సంఘాలు అంటున్నాయి. గతంలోనూ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నేవీ వారికీ స్థలాన్ని అప్పగించేందుకు సిద్ధమయ్యారని...కానీ ఈ ప్రాంత విశిష్టతను తెలుసుకుని వెనకడుగు వేశారని గుర్తు చేశారు. తెదేపా హయాంలోనూ సినీ క్లబ్‌కు శంకుస్థాపన చేసి విరమించుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కొండపై గ్రే హౌండ్స్ దళాలు శిక్షణ శిబిరం కొనసాగిస్తున్నాయని...దీనిపై ఇప్పటికే పోరాటం జరుగుతోందని చెప్పారు. ఇంతలోనే అతిథి గృహ నిర్మాణ ప్రతిపాదన తీసుకురావడం ఏ మాత్రం సరికాదని సంఘ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని... లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.
మనోభావాలను దెబ్బతీయవద్దు....
పవిత్రమైన తొట్ల కొండలో అతిథి గృహ నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన సరికాదని భాజపా నేత విష్ణుకుమార్ రాజ్ అన్నారు. చారిత్రక విలువలు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహారించవద్దని హితవు పలికారు.
రాజకీయం చేయొద్దు: మంత్రి అవంతి
తొట్ల కొండ స్థలంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తొట్ల కొండ ఉన్న ప్రాంతానికి కిలో మీటరు దూరంలో అతిథి గృహ నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఒక్క విశాఖలోనే గాక విజయవాడ, కర్నూలులో కూడా ప్రభుత్వ అతిథి గృహాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించదని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధిపరమైన అంశాలను రాజకీయం చేయవద్దని కోరారు.
ఓ వైపు బౌద్ధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా... ప్రభుత్వం మాత్రం తొట్ల కొండకు, అతిథి గృహానికి సంబంధం లేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం వివాదానికి కేంద్రంగా నిలిచింది.
ఇదీ చదవండి