విశాఖలోని సాలిగ్రామపురం పోర్టు ఉద్యోగుల నివాస సముదాయాలు శిథిలావస్థకు చేరడం వల్ల వాటిల్లో ఇప్పుడు ఉద్యోగులు ఉండడంలేదు. పోర్టు యాజమాన్యం కూడా ఒక్కొక్కటిగా ఈ భవనాలను నేలమట్టం చేసి చదును చేస్తోంది. విద్యుత్తు, నీటి సరఫరాను కూడా పూర్తిగా నిలిపివేశారు. అయినా సరే ఒక కుటుంబం మాత్రం అక్కడి నుంచి ఖాళీ చేసే పరిస్థితి లేక కాలం వెళ్లదీస్తోంది. ఏరోజు ఈ భవనం నేల మట్టం చేస్తారా..? తామెక్కడికి వెళ్లాలా..? అన్నదే వీరి చింత. నిజానికి వీరి కోసం ఈ చింత కాదు. వారితో ఉంటున్నమూగ జీవాల కోసమే ఈ తపనంతా.
పోర్టులో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగి సత్యనారాయణ. ఆయన భార్య భాగ్యలక్ష్మి. ఈ కుటుంబం ఎంతో కాలంగా ఇక్కడి నివాససముదాయంలో ఉంటోంది. వీరికి మూగజీవాలంటే ఎంతో ప్రేమ, గారాబం. మిగిలిన వారికంటే భిన్నంగా వీరు కుక్కల పట్ల ప్రేమ చూపుతున్నారు. గాయపడినా, అనారోగ్యంతో ఉన్నా... చేరదీసి వాటిని సాకడం వీరి మూగజీవ ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం. పోనీ బాగా ధనవంతమైన కుటుంబమా అంటే కాదు. వచ్చే కొద్దిపాటి పింఛన్తో వీరు ఈ క్వార్టర్స్ లో ఉంటున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు. వారిలో ఒకరు మాత్రమే ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నారు.
కుంటి, గుడ్డి వంటి సమస్యలతో ఉన్న కుక్కలు దాదాపు 30కిపైగా వీరి ప్రాంగణంలోనే ఉంటాయంటే అశ్చర్యం కలగక మానదు. వీధి కుక్కలేగా వీటికి టీకాలు వంటివి లేవనుకుంటే పొరపాటే. వాటన్నింటికి తమ ఖర్చుతోనే వ్యాక్సిన్ వేయిస్తారు. అనారోగ్యం బారిని పడిన వాటికి పశువైద్యునితో చికిత్స చేయిస్తారు. ఆర్ధరాత్రి సమయంలోనూ ఇవి బాధపడుతున్న సందర్భంలో ఎన్నోసార్లు ఈ దంపతుల కుమార్తెలే వైద్యులు వద్దకు పరుగులు తీసిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటి పోషణ కోసం దాదాపు నెలకు 25 వేల రూపాయల పైచీలుకు ఖర్చు చేస్తున్నారు. మరో 20కి పైగా వీధి కుక్కలకు వీరే స్వయంగా వెళ్లి ఆహారం అందిస్తుంటారు.
ఇదే వీరికి సమస్యలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ క్వార్టర్లు శిథిలావస్థకు చేరినా.. విద్యుత్తు లేకపోయినా కాలక్షేపం చేయడానికి కారణమైంది. ఈ ముగ్గురు అమ్మాయిల పెళ్లిళ్లకూ ఇదే అడ్డంకిగా నిలుస్తోంది. వీధి కుక్కల పెంపకం వాటికి సేవ చేయడం పెద్దగా జీర్ణించుకోలేక సంబంధాలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. తమకు ఎవరైనా అద్దెకు ఒక ఇల్లు ఇస్తే చాలన్నది వీరి విజ్ఞప్తి. తమను ఆశ్రయించిన కుక్కలతో పాటు తాము నివాసం ఉండడానికి అధికార్లయినా సహకరించాన్నది వీరి విన్నపం.
కొన్ని కుక్కలకు చికిత్స అందించినా చనిపోతే ఈ కుటుంబం పడే బాధ వర్ణణాతీతం. అసలు ఈతరహా కుటుంబం ఉందంటేనే ఎవరూ నమ్మరు. కేవలం మూగజీవాలపై ఉన్న ప్రేమే తమను నడిపిస్తోందని ఆ కుటుంబం చెబుతోంది.
ఇదీ చదవండీ... మంత్రి జయరాం భూదందాకు పాల్పడ్డారు: అయ్యన్నపాత్రుడు