విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర స్వామి చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర.. ఈరోజు శ్రీకాకుళంలో జరిగింది. పట్టణంలోని డేఅండ్ నైట్ సెంటర్ నుంచి భక్తులు శోభాయాత్ర నిర్వహించి.. స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. అరసవిల్లిలో సూర్యనారాయణ స్వామిని, శ్రీకూర్మంలో కూర్మనాథ స్వామిని, విజయదుర్గ ఆలయాన్ని, లక్ష్మీ గణపతి ఆలయాన్ని, కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని, కోటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు.
శారదా పీఠానికి బీజం పడింది శ్రీకాకుళంలోనే...
శారదా పీఠానికి బీజం పడింది శ్రీకాకుళం జిల్లాలోనే అని.. గురువులు స్వరూపానందేంద్రుల జన్మస్థలం దేరసాం ఇక్కడిదేనని స్వాత్మానందేంద్ర స్వామి వివరించారు. హైందవ ధర్మ జాగృతికి హిందువులంతా సైనికుల్లా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. దేవాలయాల నిర్వహణకు ఇతోధికంగా సాయం చేయాలని సూచించారు. ఇది దైవారాధనతో సమానమన్నారు.
దళితులు, గిరిజనులతో కలిసి తిరుమలకు...
హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ధర్మ ప్రచార యాత్ర చేపట్టినట్లు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 32వేల కిలోమీటర్ల మేర యాత్ర నిర్వహించామని వివరించారు. ఈనెల 31తో ఈ కార్యక్రమం ముగుస్తుందన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది దళితులు, గిరిజనులతో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి:
ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తితో 'ఉక్కు సత్యాగ్రహం' చిత్ర నిర్మాణం