రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, ప్రాంతాల్లో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందడి మొదలయ్యింది. మార్కెట్లన్ని పూలు, పూజా సామాగ్రితో పండగ వాతావరణం నెలకొంది. లక్ష్మీ పూజకు కావల్సిన సామాగ్రిని కొనేందుకు వచ్చిన ప్రజలతో మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఏమాత్రం కరోనా భయం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
విశాఖ జిల్లా….
విశాఖ జిల్లా ఆనందపురం పూలమార్కెట్ వినియోగదారులతో కిక్కిరిసింది. కరోనా విజృంభన పెరుగుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఆ భయం ఏమాత్రం కనిపించడం లేదు. సామాజిక దూరానికి నీళ్లు వదిలి పూలు కొనేందుకు పోటీ పడ్డారు. విపరీతమైన రద్దీ నెలకొనడంతో కనీసం నిలబడడానికి కూడా అవస్థలు పడ్డారు. ట్రాపిక్ పోలీసులు సైతం కిక్కిరిసి ఉన్న జనం మధ్యలోకి వెళ్లేందుకు సాహసించలేదు. చోడవరం పట్టణంలో శ్రావణ మాసం సందడి కనిపించింది. పట్టణ ప్రజలతో పాటు గ్రామాలనుంచి రావడంతో గురువారం రద్దీ నెలకొంది. మార్కెట్ లో అన్ని ధరలు ఆకాశాన్నింటాయి. కొనుగోలు దారులతో బంగారు నగల దుకాణాలు రద్దీగా మారాయి.
చిత్తూరు జిల్లా…
తిరుపతి రోడ్డు మార్కెట్లన్నీ కిక్కిరిసిపోయాయి. వరలక్ష్మీవ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రి కోసం ప్రజలు బారులు తీరారు.. కరోనా మహమ్మారి ఓవైపు భయబ్రాంతులకు గురి చేస్తున్న... ప్రజలు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరించారు. లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్న గురువారం ఉదయం 11 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది.
తూర్పు గోదావరి జిల్లా…
తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో ప్రధాన రహదారి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి అని అధికారులు ముందుగా ప్రకటించడం తో శ్రావణ శుక్రవారం పూజకు సామగ్రి కొనుగోలుకు ప్రజలు ఎగబడ్డారు... కిలోమీటర్ మేర కిక్కిరిసిపోయరు. అక్కడి దుకాణ దారులు కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో భయాందోళన వ్యక్తమవుతోంది. ఆలమూరు మండలం చింతలూరులోని వేంచేసి ఉన్న శ్రీనూకాంబిక అమ్మవారి ఆలయంలో దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రామలింగం తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రావణ శుక్రవారం సందర్భంగా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అమ్మవారికి పూజా కార్యక్రమాలు అర్చకులచే ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు భక్తులు ఎవరికి కూడా దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. బంగారం ధర భారీగా పెరగడంతో పసిడి విక్రయాలు కాస్త తక్కువనే చెప్పాలి.
కృష్ణా జిల్లా…
కృష్ణా జిల్లా వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. మచిలీపట్నంలో లాక్‌డౌన్ అమలులో ఉండటంతో దుకాణాల వేళలపై ఆంక్షలు అమలవుతున్నాయి. విజయవాడ నగరంలోనూ 11 ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించి ఆంక్షలు అమలు చేస్తున్నారు. పుత్తడి ధర విపరీతంగా పెరగడంతో పెద్ద సంఖ్యలో జనం స్వర్ణాభరణాల కొనుగోలుకు రావడం లేదు. పూల,పండ్ల మార్కెట్లు మాత్రం మహిళలు, ప్రజలతో కిక్కిరిసి పోయాయి. ధరలు పెరిగినా కొనుగోళ్లు జరుగుతున్నాయి.
కరోనా విజృంభిస్తున్నా అన్నిచోట్లా ప్రజలు నిబంధనలకు నీళ్లు వదిలి..ఏమాత్రం జాగ్రత్తలు పాటించకుండా సంచరించడం సరికదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు, అధికారులు సైతం జనం రద్దీని చూసి ఏమీ చేయలేక చేతులెత్తేసిన తీరు విమర్శవృలకు తావిస్తోంది. ఏది ఏమైనా స్వీయ రక్షణ,నియంత్రణ కరోనా వ్యాప్తి కట్టడికి ఎంతో ముఖ్యం…అందుకు అనుగుణంగా ఎవరికి వారే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
ఇవీ చదవండి: సీపీఎస్ రద్దు ఉద్యమ కేసుల నుంచి ఉద్యోగులు, టీచర్లకు విముక్తి