సాగర నగరి విశాఖలో మత్స్యకారుల మధ్య రింగువల వివాదం సృష్టించింది. 13 బోట్లలో రింగువలలతో వెళ్లిన వాసవానిపాలెం మత్స్యకారులను.. 100 బోట్లలో పెద్దజాలరిపేట జాలర్లు వెళ్లి.. చుట్టుముట్టారు. పెద్దజాలరిపేట జాలర్లు అడ్డుకోవడంతో వాసవానిపాలెం జాలర్లు వెనుదిరిగారు. వాసవాని పాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు తాము కొన్నేళ్లుగా రింగు వలతో చేపలు పడుతున్నామని అంటున్నారు. మత్స్యశాఖ అధికారుల ఆదేశాలతో గత 20 రోజుల నుంచి వేట నిలిపి వేశామన్నారు. నిన్న వచ్చిన అనుమతుల అనంతరం తాము రింగువలలతో వేటకు వెళ్లామని.. ఇంతలో ఊహించని విధంగా పెద్దజాలారిపేట, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు వందకుపైగా బోట్లతో తమను చుట్టుముట్టారని తెలిపారు. తమ వలలను సైతం వారు కోసేశారని అన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సురక్షితంగా బయటకు వచ్చామని చెబుతున్నారు. రింగు వలవేట మాత్రమే తమకు తెలుసని.. గేలం వేసి వేట చేసే విధానం తమకు రాదని దీనిపై మత్స్య శాఖ నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
రింగు వలను వ్యతిరేకిస్తున్న మత్స్యకారుల వాదన దీనికి భిన్నంగా ఉంది. రింగువలతో వేట చేస్తే మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు అంటున్నారు. ఫలితంగా చేపల ఉత్పత్తి తగ్గిపోతుందని.. దీనిపై ఆధారపడి వేల సంఖ్యలో మత్స్యకారులు జీవిస్తున్నారని.. రింగు వలతో వేటను అరికట్టాలని వారు కోరుతున్నారు.
విశాఖలో నెలకొన్న వివాదంతో మత్స్య శాఖ అప్రమత్తమైంది. తాత్కాలికంగా రింగువలతో వేట చేయడాన్ని నిషేధించింది. ప్రభుత్వం ఈ విషయంపై తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. మత్స్యశాఖ ఆదేశాలను ఉల్లంగిస్తే.. సదరు బోటు రిజిస్ట్రేషన్, లైసెన్స్‌ను ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేస్తామని స్పష్టం చేసింది.
మత్స్యకారుల గ్రామాలు మధ్య ఘర్షణ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖలో మత్స్య కారులు ఉండే ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
ఇదీ చదవండి: సముద్రంలో వేట.. మత్స్యకారుల మధ్య రింగువలల వివాదం