రాష్ట్రంలో కాపుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలోని మాధవధారలోని నిర్వహించిన కాపుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కాపు సామాజిక భవనాల నిర్మాణానికి చేయూత అందిస్తామన్నారు. విశాఖలో కాపుల భవనం కోసం నాలుగు ఎకరాల స్థలం కేటాయించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. అన్ని సామాజిక వర్గాల భవనాలు ఒకేచోట ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.
కాపు కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని వెల్లడించారు. కాపుల పట్ల సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని...కేబినెట్లో పెద్దపీట వేశారని గుర్తు చేశారు. జీవీఎంసీ ఎన్నికల్లోనూ 23 మందికి టిక్కెట్లు ఇచ్చామని చెప్పారు. తుని రైలు దగ్ధం కేసుల అంశాన్ని త్వరలోనే కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించి.. వాటిని కూడా రద్దు చేయించే విధంగా ప్రయత్నిస్తామన్నారు. దశల వారీగా కాపుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత అందిస్తోందన్నారు.
గత ప్రభుత్వం కాపులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఉద్యమ నేత ముద్రగడతో పాటు అనేక మందిపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. జీవీఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి
నాకెవరితో విభేదాల్లేవ్.. నేను వెళ్లే దారి వాళ్లకు నచ్చకపోవచ్చు: కేశినేని నాని