మాతృభాషలో బోధనతో దేశాభివృద్ధి: విద్యాసాగర్‌రావు - మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు వార్తలు
ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మాతృ భాషలో సాంకేతికత, విద్యను అభ్యసించడం దేశాభివృద్ధికి దోహదపడుతుందని విద్యాసాగర్ రావు అన్నారు.
ప్రపంచంలో ఉన్న ఏడు వేల మాతృభాషల్లో ప్రతి రెండు వారాలకు ఒక భాష అంతరించిపోతోందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలో తెలుగు మహిళా రచయితల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ, మహిళా రచయితలు తదితరులు హాజరయ్యారు.
మూలాలను కోల్పోతున్నారు
ప్రతి ఒక్కరూ వారి మాతృ భాషలో సాంకేతికతను అభ్యసించడం ద్వారా అది దేశాభివృద్ధికి తోడ్పడుతుందని విద్యాసాగర్‌రావు సూచించారు. కేవలం ఆంగ్ల భాషపైనే దృష్టి పెట్టే విధంగా విద్యార్థులను తయారు చేయడంతో వారు మూలాలను కోల్పోతున్నారని వెల్లడించారు.
ప్రతి ఏటా.. ఓ నినాదం
ప్రతి ఏడాది మాతృ భాషా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళుతోందని లక్ష్మీ నారాయణ అన్నారు. విద్యలో, సమాజంలో బహుళ భాషలను ప్రోత్సహిస్తే ఐక్యత సాధ్యమవుతుందనే నినాదాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం పలువురు కవులను, రచయితలను సన్మానించారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్... పలు చోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు