మంత్రి అవంతి శ్రీనివాస్‌కు పబ్లిసిటీ జబ్బు పట్టుకుందని... ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు వ్యాఖ్యానించారు. వైకాపా గంజాయి వనంలో తాను తులసి మొక్క అనే అపోహలో అవంతి మునిగి తేలుతున్నారని ఎద్దేవా చేశారు. మోసం, దగా, వంచనకు మారుపేరు అవంతి శ్రీనివాస్ అని దుయ్యబట్టారు. పాలన గాలికొదిలేసి గాఢ నిద్రలో ఉన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి కంట్లో పడేందుకు... అడ్డమైన డ్రామాలాన్నీ ఆడుతున్నారన్నారని ధ్వజమెత్తారు.
మంత్రి పదవిని చేపట్టిన 4నెలల్లో విశాఖ జిల్లాకు కనీసం ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో మంత్రి అవంతి ఉన్నారని మండిపడ్డారు. తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారని ఆక్షేపించారు. విశాఖలో చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి అవంతి శ్రీనివాస్‌కు మైండ్ బ్లాక్ అయిందన్నారు.
విమర్శలకు దిగే ముందు... రాజకీయ అవకాశం కల్పించింది చంద్రబాబేనన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. శ్మశానాలు, పాఠశాలలకు వైకాపా రంగులు వేయటంపై ఉన్న శ్రద్ధ... ప్రజా సంక్షేమంపై లేదని దుయ్యబట్టారు. వశిష్ట బోటుకు అనుమతిచ్చి 50మందికిపైగా ప్రాణాలను బలిగొన్న అవంతి శ్రీనివాస్... వశిష్టాసురుడిగా పేరు పొందారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండీ... రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు..నవంబర్ 1 నుంచి అమలు