మిజోరం గవర్నర్‌గా నియమితులైన కంభంపాటి హరిబాబు ఆ రాష్ట్రానికి బయల్దేరారు. విశాఖ విమానాశ్రయం నుంచి కోల్‌కతా బయల్దేరిన హరిబాబు..అక్కడి నుంచి మిజోరం వెళ్లనున్నారు. మిజోరం గవర్నర్‌గా ఆయన రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. విశాఖ విమానాశ్రయానికి వచ్చిన హరిబాబుకు భాజపా కార్యకర్తలు వీడ్కోలు పలికారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి విశాఖ వచ్చిన హరిబాబు.. విద్యార్థి నాయకుడిగా కీలకపాత్ర పోషించారు. చదువు పూర్తయ్యాక అక్కడే 24 ఏళ్లు ఆచార్యుడిగా పనిచేశారు. జైఆంధ్ర ఉద్యమంలో తెన్నేటి విశ్వనాథం, సర్దార్ గౌతు లచ్చన్న, ఎం.వెంకయ్యనాయుడులతో కలిసి ఉద్యమాలు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 1974-75 మధ్య పోరాటంలో హరిబాబును నాటి ప్రభుత్వం అరెస్టుచేసి ఆరు నెలలు జైలుకు పంపింది.
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడికి సన్నిహితుడిగా హరిబాబుకు గుర్తింపు ఉంది. 2014లో విశాఖ ఎంపీగా వై.ఎస్.విజయమ్మపై గెలుపొందారు. విశాఖ నుంచి గవర్నర్ గిరీ దక్కించుకున్న మొట్టమొదటి వ్యక్తి ఈయనే. హరిబాబు భార్య జయశ్రీ గృహిణి. వీరికి చేతన, చందన అనే ఇద్దరు కుమార్తెలున్నారు.
ఇదీ చదవండి: తొలినుంచి ప్రతి అంశంలో పార్టీ మాట జవదాటని తత్వమే ఆయనది