భారత్ ద్వీపకల్ప దేశం(India is a peninsular country). త్రివిధ దళాలకు ఎంత పదును పెడితే అంత రక్షణ మనదేశానికి లభిస్తుంది. త్రివిధ దళాలలో ఒకటైన నౌకాదళ శక్తి సామర్థ్యాలను పెంపొందించేందుకు భారత్ సిద్ధమౌతోంది. సముద్రజలాలపై పట్టు బిగించేందుకు భారత నౌకాదళం(Indian Navy) సరికొత్త హంగులు దిద్దుకుంటోంది. ఈ అధ్యాయంలో ఇప్పుడు దేశీయ పరిజ్ఞానం తోడవుతోంది. దేశీయంగా తయారైన యుద్ధ నౌకలు, తదితర అనుబంధ నౌకలు, యంత్ర సామగ్రి వెరసి భారత నౌకాదళానికి నిరంతరం కొత్త శక్తులు సమకూరుస్తూనే ఉన్నాయి. ఐఎన్ఎస్ విశాఖతో (INS Visakha)పాటు మరో యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్(INS Vikrant) కూడా ఈ జాబితాలో ఉంది. ఇది ఆరేళ్ల క్రితమే నిర్మాణం పూర్తి చేసుకుని వివిధస్థాయిల్లో పరీక్షలు ఎదుర్కొంటోంది. ప్రాథమిక ట్రయిల్స్ విజయవంతంగా పూర్తి చేసింది. కొద్దినెలల్లో తుది పరీక్షలు పూర్తి చేసుకుని 2022లో నౌకాదళంలో కమిషన్ కానుంది. 30 యుద్ధ విమానాల్ని మోసుకుపోగల సామర్థ్యమున్న ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌకా దళానికి వెయ్యేనుగుల బలమివ్వనుంది.
ఐఎన్ఎస్ విశాఖతోపాటు మరో బ్రహ్మాస్త్రం..
భారత నౌకాదళం పొదిలో ఐఎన్ఎస్ విశాఖతో పాటు మరో బ్రహ్మాస్త్రం చేరనుంది. 1971 పాక్ యుద్ధంలో విజయానికి కారణమైన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకకు 1997లోనే వీడ్కోలు పలికారు. విజయానికి(Victory), శౌర్యానికి (Bravery)మారు పేరైన విక్రాంత్ పేరిట విమాన వాహక యుద్ధ నౌక (Aircraft carrier) సిద్ధం చేయాలని భారత ప్రభుత్వం ఆనాడే నిశ్చయించింది. అది కార్యరూపం దాల్చి 1999లో ఇండియన్ నేవీ కి చెందిన డైరక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ దీనికి రూపకల్పన చేసింది. ఈ నౌక డిజైనింగ్ పూర్తైన తర్వాత కొచ్చి షిప్ యార్డులో కీలక భాగాల తయారీ ఆరంభించారు. 2009లో దీని నిర్మాణం కీలక దశకు చేరుకుంది. 2011లో కొచ్చి డ్రైడాక్ నుంచి విక్రాంత్ బయటకు వచ్చింది. నాలుగేళ్ల క్రితం అంటే 2015లో జూన్ లో కొచ్చిలోనే జల ప్రవేశం లాంఛనంగా చేసింది. అక్కడి నుంచి వివిధ రకాల పరీక్షలను ఎదుర్కొంది ఈ బాహుబలి నౌక.
బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేకతలు..
దక్షిణ నౌకాదళంలోని కొచ్చి ప్రాంతంలో బేసిన్ ట్రయిల్స్(Basin Trails) అన్నింటిని ఒక్కొక్కటిగా నిర్వహిస్తూ వచ్చారు. ఈ అతి భారీ విమాన వాహక నౌక ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో కొచ్చిలోనే దాదాపు 2 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించింది. తొలి దశ ట్రయిల్స్ విజయ వంతం(first step trials success) కావడం వల్ల నౌకాదళం రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రాజెక్టులో ముందుకు దూసుకు వెళ్తోంది. నాలుగు ఎల్ ఎం 2500 గ్యాస్ టర్బైన్లు, ప్రధాన గేర్ బాక్స్ లు, ప్రొపైల్లర్ నియంత్రణ, సమీకృత నియంత్రణ విధానం, సెంట్రిఫ్యూజన్, విద్యుత్తు ఉత్పత్తి, అంతర్గత సమాచార వ్యవస్ధ వంటి కీలక విభాగాల పని తీరుపై తొలి దశ పరీక్షలలో దృష్టి పెట్టారు. ఐఎన్ఎస్ విక్రాంత్ పొడవు 262 మీటర్లు. వెడల్పు 62 మీటర్లు. ఎత్తు 59 మీటర్లు. బరువు దాదాపు 40 వేల టన్నులు. సూపర్ స్ట్రక్చర్లు 5 ఉండగా డెక్ లు 14 అందుబాటులో ఉన్నాయి.
కంపార్టుమెంట్లు 2వేల 300 వరకూ ఉన్నాయి. మహిళా సిబ్బంది అవసరాల కోసం ప్రత్యేక క్యాబిన్ లు ఏర్పాటు చేశారు. 1700 మందికి పైగా సిబ్బంది ఇందులో విధులు నిర్వర్తించేలా సిద్ధం చేశారు. 2 విమాన రన్‌వేలూ అందుబాటులో ఉన్నాయి. గరిష్ఠంగా 28 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకు పోగలదు ఐఎన్‌ఎస్ విక్రాంత్. వేల సంఖ్యలో ఆయుధాలు, నిర్దేశిత సంఖ్యలో యుద్ధ ట్యాంకర్లు, 30 యుద్ధ విమానాలు మోసుకుపోగలదు. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ఈ నౌక సొంతం. యాంటీ రేడార్, యాంటీ సబ్ మెరైన్, గగన తల నిఘా, సముద్ర జలాలపై నిఘా వ్యవస్థలన్నీ ఇందులో అమర్చారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే విధంగా దీనిని రూపొందించారు. ప్రమాద నిరోధక వ్యవస్థలు అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ప్రమాద సమయంలో సిబ్బంది అత్యంత వేగంగా సురక్షితంగా బయటపడే వ్యవస్థలను ఏర్పాటుచేశారు.
స్వదేశీ పరిజ్ఞానం(Indigenous knowledge)తో నిర్మించిన ఈ యుద్ధనౌక సీట్రయిల్స్‌లో అంచనాల కంటే అధికంగానే తన సామర్థ్యం నిరూపించుకుంది. తద్వారా ఇప్పటికే విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్ నిలిచింది. ఈ యుద్ధ నౌక నిర్మాణంలో దాదాపు పదేళ్ల పాటు 14 వేల మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 23 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం. 30 అత్యాధునిక మిగ్ 29కె యుద్ధ విమానాల్ని ఏకకాలంలో మోసుకుపోగల సామర్థ్యముంది ఈ నౌకకు. కమోవ్ యుద్ధ విమానాలను, హెలీకాప్టర్లను కూడా ఇబ్బంది లేకుండా తీసుకు పోయే సత్తా ఉంది. నౌక ప్రయాణంలో ఉన్న సమయంలోనే విమానాల లాండింగ్, టేకాఫ్ చేసుకునేట్టుగా తీర్చిదిద్దారు. సొంతగా విద్యుదుత్పత్తి(Own power generation)లోనూ ఈ నౌకది ఒక ప్రత్యేకతే. ఏకంగా 50 వేలకు పైబడిన జనాభా ఉన్న చిన్న పాటి నగరానికి సరిపడా విద్యుత్తు ఉత్పత్తి చేయగల సత్తా విక్రాంత్ సొంతం.
విక్రాంత్ రాకతో..
యుద్ధ విమానాల మొహరింపులో నౌకాదళానికి ఐఎన్ఎస్ విక్రమాదిత్య (INS Vikramaditya)ప్రస్తుత అవసరాలు తీరుస్తోంది. విక్రాంత్ అందుబాటులోకి రావడం ద్వారా పూర్తిగా పరిస్థితి మారనుంది. భారత్ లో నిర్మించిన అతిపెద్ద, అనేక ప్రత్యేకతలున్న యుద్ధనౌక ఇదేనని నేవీ వర్గాలు వెల్లడించాయి. 1971లో పాకిస్థాన్ యుద్ధంలో కీలకపాత్ర వహించి, భారత్ విజయపథాన నిలిపిన ఐఎన్ఎస్ విక్రాంత్(INS Vikrant) సేవలకు గుర్తుగా దేశీయంగా ఈ నౌకను నిర్మించడం చరిత్రలో నిలిచిపోనుంది. పాక్ పై సాధించిన విజయానికి (Victory over Pakisthan) 50 ఏళ్లు పూర్తైన స్వర్ణవర్ష ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ నౌక నేవీలో చేరడం మంచి పరిణామమన్నది విశ్లేషకుల అంచనా.
హిందూ మహా సముద్ర(Indian Ocean) ప్రాంత పరిరక్షణలో ఐఎన్‌ఎస్ విక్రాంత్ రాక ఒక కీలక మలుపు కానుంది. ద్వీపకల్పదేశంగా ఉన్న భారత్ కి ఆసియా దేశాల నౌకాయానం, నౌకా భద్రత వంటి కీలక బాధ్యతలు కూడా ఉన్నాయి. అధునాతన యుద్ధ నౌకల తయారీ కోసం విదేశాలపై ఆధార పడకుండా దేశీయంగా రూపొందించడం ద్వారా మేకిన్ ఇండియాను బలోపేతం చేసినట్టవుతోంది. డీఆర్డీవో (DRDO) పరిధిలో ఉన్న పరిశోధనా సంస్థలలో రూపొందించిన డిజైన్లు భారత్ రక్షణ సామర్థ్యా(India's defense capabilities)లకు మచ్చుతునకలుగా నిలుస్తున్నాయి. ఈ అత్యాధునిక అతి భారీ యుద్ధ నౌకను భారత్ వ్యూహాత్మకంగా తూర్పు నౌకాదళం పరిధిలో మోహరించనుంది. విక్రాంత్ రాకకోసం విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం(Eastern Navy) ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అనుకున్న ప్రకారం 2022 మార్చినాటికి విశాఖ తీరానికి చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.
ఇదీ చదవండి : INS VISHAKAPATNAM: రేపు నౌకదళం అమ్ముల పొదిలోకి.. ఐఎన్ఎస్ విశాఖ