దేశాభివృద్ధిలో శక్తి వనరులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రంగాల్లో గత కొన్ని ఏళ్లుగా.. భారత్ దూసుకుపోతోంది. పెట్రోలియం, సహజ వాయువు లాంటి సంప్రదాయ వనరులతో పాటు, సంప్రదాయేతర వనరుల వినియోగానికీ మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలోనే ఆయా రంగాల్లో నిపుణుల అవసరం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే విశాఖ పట్నంలో.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) పేరుతో జాతీయ విద్యా సంస్థను ఏర్పాటు చేసింది.. కేంద్ర చమురు సహజ వాయువు మంత్రిత్వ శాఖ.
దేశ వ్యాప్తంగా మూడే..
ఐఐటీ అడ్వాన్స్డ్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్న ఐఐపీఈ బీటెక్ డిగ్రీలు అందిస్తోంది. ఇలాంటివి దేశంలో మూడే ఉన్నాయి. అందులో ఒకటి మన దగ్గర ఉంది. మిగతా రెండు.. ఉత్తరప్రదేశ్లోని అమేథి, అసోంలోని దిగ్భాయ్‌లో నెలకొల్పారు. శక్తి వనరుల రంగాల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న పద్ధతుల్ని మరింత మెరుగుపరచడంతో పాటు, నూతన విధానాలకు రూపకల్పన చేసేందుకు.. ఈ విద్యా సంస్థ కృషి చేస్తోంది.
ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా..
ఇటీవలే.. ఇక్కడ నిర్వహించిన స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో.. వివిధ అంశాల్లో మంచి ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. వీరంతా.. చమురు, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల రంగంపై విస్తృత పరిశోధనలు చేసేందుకు సిద్దమంటున్నారు..
ఈ విద్యాలయం నుంచి పట్టాలు అందుకుని.. ఇప్పటికే చమురు సంస్థల్లో ఉద్యోగాల్లో చేరినప్పటికీ.. తమ భవిష్యత్తు మాత్రం పరిశోధన వైపే అంటున్నారు చాలా మంది విద్యార్థులు. పెట్రోలియం ఆధారిత ఉత్పత్తుల ప్రాధాన్యం తిరుగులేనిదే అయినప్పటికి.. ప్రత్యామ్నాయ ఇంధనా, శక్తి వనరుల వినియోగంపై తాము పరిశోధన చేస్తామంటున్నారు.. ఈ విద్యార్థులు..
ఇక్కడ చదివితే.. అటు పరిశ్రమలోనూ, ఇటు పరిశోధనలలోనూ రాణించేందుకు అవకాశాలుంటాయి. రానున్న రోజుల్లో నిపుణుల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న ఇక్కడి కోర్సులకు మంచి ఆదరణ లభిస్తోంది.
అంతర్జాతీయంగా.. మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న భారత్, తన అవసరాల్లో 80 శాతం మేర విదేశాల మీదే ఆధారపడుతోంది. అందుకే.. దేశంలోని చమురు క్షేత్రాల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది.. భారత్. అలాంటి కీలక ప్రాజెక్టుల్లో.. తమ వంతు పాత్ర పోషించనున్నారు.. ఈ విద్యార్థులు.
ఇదీ చదవండి: 'ఆ పేలుడు శక్తి.. వందల రెట్ల హిరోషిమా అణుబాంబులకు సమానం'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!