ఇమ్నెక్స్-19 పేరిట భారత్-మయన్మార్ రెండో సంయుక్త విన్యాసాలు విశాఖలో ప్రారంభమయ్యాయి. ఐఎన్ఎస్ రణ్‌విజయ్‌పై ఆరంభ వేడుక జరిగింది. రెండు నేవీల మధ్య సాంకేతిక సహకారం, ఇతర అంశాలను ఈ సందర్భంగా పంచుకుంటారు. మయన్మార్ ఫ్లీట్ కమాండర్ గా కెప్టెన్ టెట్ విన్ తున్ సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొంటున్నారు. ఈ బృందం తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ కలిసి పలు అంశాలపై చర్చించింది. హార్బర్ దశలో రెండు నౌకాదళ బృందాల మధ్య చర్చలు, శిక్షణ, నిర్వహణ వంటి అంశాలపై సమాచార మార్పిడి జరుగుతుంది. భారత నౌకాదళం నుంచి రణ్ విజయ్, కుతార్ లు మయన్మార్ నౌకలతో సంయుక్త విన్యాసాలలో పాల్గొంటున్నాయి. గగన తల, భూతల, సముద్ర తల ఫైరింగ్ విన్యాసాలు, హెలీకాప్టర్ లతో పరిశీలన వంటివి ఈ సంయుక్త విన్యాసాలలో ఉంటాయి. గతంలో కంటే సంక్లిష్టంగా ఈ సారి విన్యాసాలు ఉంటాయని నౌకాదళం వెల్లడించింది.
మహా రక్తదాన శిబిరం ఏర్పాటు
తూర్పు నౌకదళం మహా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. నేవీ వారోత్సవాల సందర్భంగా ఐఎన్ఎస్ శక్తి లో పెద్ద సంఖ్యలో నౌకాదళ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు రక్తదానం చేశారు. రియర్ అడ్మిరల్ సూరజ్ బెర్రీ ఈ శిబిరాన్ని ఆరంభించారు.320 మందికి పైగా వ్యక్తులు ఇందులో రక్తదానం చేశారు.