కొవిడ్- 19తో పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీస్‌ను.... 'హ్యూమన్ కొవిడ్- 19 ఇమ్యూనో గ్లోబిన్ ఇంజక్షన్' పేరుతో రూపొందించామని హైదరాబాద్‌కు చెందిన ఎంఆర్పీఏ కార్పొరేషన్ తెలిపింది. దీనికి ఇప్పటికే ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిపల్ అఫ్ మెడికల్ రీసెర్చ్) గుర్తింపు లభించిందని.... క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు తాజాగా అనుమతి ఇచ్చిందని ఆ సంస్థ ఛైర్మన్, విశాఖకు చెందిన డాక్టర్ శ్రీహరి వెల్లడించారు. ఈ ఇంజక్షన్‌ను కరోనా సోకకు ముందు లేదా సోకిన తరువాత అయినా ఇవ్వవచ్చని వెల్లడించారు. దీని ద్వారా ఇమ్యూనో గ్లోబిన్స్ను శరీరంలోకి పంపితే అవి కరోనా వైరస్‌తో పోరాడతాయని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేలోపు కొంతమందిని అయినా కాపాడాలనే లక్ష్యంతో ఇంజక్షన్‌ను రూపొందించామని ఆయన అన్నారు.
సుమారు 50 మంది పైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి నివేదిక అందించాలని ఐసీఎంఆర్ కోరిందని డాక్టర్ శ్రీహరి తెలిపారు. కరోనా సోకిన వారు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామన్నారు. పూర్తి స్థాయిలో విజయవంతం అయితే దీన్ని వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామని శ్రీహరి తెలిపారు. సత్ఫలితాలు రాకపోతే.... కొవిడ్- 19 కోసమే ప్రత్యేకంగా యాంటీబాడీస్‌ను తయారు చేసే పనిలో కూడా తమ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎంఆర్పీఏ కార్పొరేషన్ ఉందని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి