గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన నిమిత్తం గత నెల 24న జారీచేసిన తుది గెజిట్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి తీర్పును వాయిదా వేశారు.
వ్యాజ్యానికి విచారణ అర్హత లేదు...
తుది నోటిఫికేషన్ను సవాలు చేస్తూ విశాఖకు చెందిన వెంకట ప్రణవ్ గోపాల్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరపున ప్రత్యేక జీపీ కాసా జగన్‌మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ .. వార్డుల పునర్విభజనలో ఉల్లంఘనలు ఎక్కడ జరిగాయో పిటిషనర్ స్పష్టంగా పేర్కొనలేదన్నారు. 464 అభ్యంతరాలు స్వీకరించామని అందులో 126ను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. వ్యాజ్యానికి విచారణార్హత లేదని... కొట్టేయాలని కోరారు.
కార్యాలయం నుంచే నిర్ణయిస్తారా...
పిటిషనర్ తరపు న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ.. అభ్యంతరాల స్వీకరణకు తగిన సమయం ఇవ్వలేదన్నారు. 8లక్షలు జనాభా ఉన్న విశాఖలో కేవలం 464 అభ్యంతరాలు రావడం చూస్తే తగిన సమయం ఇవ్వలేదని అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. కార్యాలయంలో కూర్చోని వార్డుల హద్దుల్ని నిర్ణయించడం సరికాదన్నారు. 50 వార్డుల్లో నిబంధనల మేరకు ఉండాల్సిన సగటు జనాభా లేరన్నారు. మరో 10 వార్డుల్లో సగటు జనాభాకు మించి ఉన్నారన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తుది నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరారు.
ఇవీ చూడండి-విశాఖ రైల్వే జోన్‌కు నిధులు మంజూరు