రాష్ట్రంలో ప్రారంభించి.. ఐదేళ్లు పూర్తయిన నిరాశ్రయుల వసతి గృహాల(నైట్ షెల్టర్లు) పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 22 షెల్టర్లకు గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం నిలిపివేసింది(stop financial help for Night Shelters ). కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద వివిధ సంస్థల నుంచి సాయం అందేలా చర్యలు తీసుకోవాలని పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వులు అత్యధిక చోట్ల అమలుకు నోచుకోలేదు. దీంతో వీటి నిర్వహణ స్వచ్ఛంద సేవా సంస్థలకు భారమవుతోంది(Night shelters are burden on charities). అనాథలకు మూడు పూటలా ఆహారం అందించేందుకు దాతల సాయం తీసుకుంటున్నారు. సిబ్బందికి ప్రతినెలా జీతాల చెల్లింపు, ఇతరత్రా ఖర్చులు కష్టతరంగా మారాయని నిర్వాహకులు చెబుతున్నారు.
విశాఖలో 3 షెల్టర్లకు జీవీఎంసీ సాయం
ఐదేళ్లు పూర్తయిన విశాఖలోని మూడు షెల్టర్లకు మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) సాయం అందిస్తోంది. మిగతా పుర, నగరపాలక సంస్థల్లో కమిషనర్లు ఏవో కారణాలు చూపించి మరోసారి ఒప్పందం చేసుకోవడం లేదని నిర్వాహకులు అంటున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రైవేట్ సంస్థల నుంచి సాయం అందించలేని పరిస్థితి ఉన్న చోట్ల పుర, నగరపాలక సంస్థల్లో సాధారణ నిధుల(జనరల్ ఫండ్స్) నుంచి అందించొచ్చు. షెల్టర్లు మూతపడకుండా జీవీఎంసీలో ఈ విధంగానే నిధులు సమకూరుస్తున్నారు. ఒక్కో షెల్టర్‌కు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.5.50 లక్షల చొప్పున నిధులు సమకూరుస్తోంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో ఈ నిధుల కేటాయింపు, షెల్టర్ల పర్యవేక్షణ సాగుతోంది. ఐదేళ్లు పూర్తవ్వని షెల్టర్లకూ కొన్ని జిల్లాల్లో బకాయిలు చెల్లించాల్సి ఉంది. సీఎఫ్‌ఎంఎస్ నుంచి ఈ నిధులు విడుదల కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
‘ఐదేళ్లు పూర్తయిన తమ షెల్టర్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిధుల్ని నిలుపుదల చేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి నిధులు సమకూర్చాలని పుర, నగరపాలక కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా సాయం అందలేదు. ఏడాదిన్నరగా సొంత నిధులు, దాతల సాయంతో షెల్టర్ నిర్వహిస్తున్నాం’. - పి.జోసెఫ్‌రాజు, సపోర్ట్ స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షుడు, చిత్తూరు
‘ఐదేళ్లు పూర్తయిన షెల్టర్లకు సాయంపై రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం నిధులు నిలిపివేయడంతో షెల్టర్ల నిర్వహణ స్వచ్ఛంద సేవా సంస్థలకు భారమవుతోంది. పుర, నగరపాలక సంస్థల నుంచైనా సాధారణ నిధులు సమకూర్చాలి. లేదంటే కొన్ని రోజులకు షెల్టర్టు మూతపడతాయి’. - ప్రగడ వాసు, ప్రభుత్వం నియమించిన నైట్ షెల్టర్ కార్యక్రమ ప్రత్యేక కమిటీ సభ్యుడు
‘నిరాశ్రయులైన పేదలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. ఐదేళ్లు పూర్తయిన షెల్టర్లకు నిధులు నిలిపి వేయాలన్న కేంద్ర నిర్ణయం సరైంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోక పోవడమూ లోపమే. స్వచ్ఛంద సంస్థల ఇబ్బందులపై సీఎం కార్యాలయం, సీఎస్, పురపాలక శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాశా’. - ఈఏఎస్ శర్మ, విశ్రాంత ఐఏఎస్ అధికారి
ఇదీ చదవండి..