విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలు..మరింత ఉద్ధృత రూపం దాల్చాయి. స్టీల్‌ప్లాంట్‌పై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందే నంటూ..ఉక్కునగరంలో నిరసనలు హోరెత్తాయి. సంస్థ ఉద్యోగులు, కార్మికులతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు...పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. సొంత గని కేటాయించమని ఎన్నో ఏళ్లుగా చేస్తున్న విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్న కేంద్రం..నష్టాలకు సంస్థను బాధ్యత వహించమనడం ఎంత వరకు సమంజసమని ఉద్యోగులు, కార్మికులు ప్రశ్నించారు. నష్టాలు వస్తున్నాయనే అంశాన్ని కారణంగా చూపి..పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకే కేంద్రం ప్రయత్నం చేస్తుందని ఆరోపించాయి.
ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా
ఉద్యమానికి మద్దతుగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు..తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు పంపించారు. రాజకీయేతర ఐకాస ఏర్పాటు చేసి పోరును ఉద్ధృతం చేసి..కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తామని గంటా చెప్పారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు..ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దనే పిటిషన్‌ను తన ట్విట్టర్‌కు జతచేశారు. దానిపై ప్రతిఒక్కరూ సంతకాలు పెట్టాలని కోరారు. సంతకం ద్వారా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మద్దతు తెలపాలని కోరారు.
రౌండ్ టేబుల్ సమావేశం
విజయవాడ దాసరి భవన్‌లో వివిధ పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. పార్టీలకు అతీతంగా పోరాటంలో పాల్గొనాలని తీర్మానించాయి. కేసుల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను సీఎం జగన్ పణంగా పెడుతున్నారని...తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు అదే సమయంలో నష్టాల నుంచి లాభాల్లోకి వస్తున్న సమయంలో ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని... తెదేపా నేత శ్రీ భరత్ అన్నారు.
ఉద్యమానికిసిద్ధం: ఏపీ ఎన్జీవోల సంఘం
ప్రైవేటీకరణను ఆపేందుకు ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధమని ఏపీ ఎన్జీవోల సంఘం ప్రకటించింది. ఇందుకు పార్టీలకు అతీతంగా ప్రజలంతా కలసి రావాలని అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తెలంగాణ సీపీఐ పార్టీ మద్దతు తెలిపింది. తాము కూడా త్వరలోనే క్షేత్రస్థాయి ఉద్యమంలో పాల్గొంటామని ఆ రాష్ట్ర సీబీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.
ఇదీచదవండి