పుర ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 10-10.30 గంటల మధ్య తొలి ఫలితం వెలువడనుంది. సాయంత్రం 6 గంటల్లోగా మహా నగర విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మినహా అన్నిచోట్లా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. విశాఖలో డివిజన్ల సంఖ్య ఎక్కువ కావడంతో ఆలస్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు. 11 నగరపాలక సంస్థల్లో 533 డివిజన్ సభ్యుల స్థానాలకు పోలైన 27,29,072 ఓట్లను లెక్కిస్తున్నారు. 71 పురపాలక, నగర పంచాయతీల్లో 1,633 వార్డు సభ్యుల స్థానాలకు పోలైన 21,03,284 ఓట్ల లెక్కింపు చేపట్టారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మునిసిపాలిటీపై ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. ఇక్కడ విజేతలకు ఇచ్చే ధ్రువీకరణ పత్రాల్లో హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని సూచిస్తారు. పుర, నగరపాలక, నగర పంచాయతీల్లో పోలైన మొత్తం ఓట్లను 4,026 టేబుళ్లలో 12,607 మంది సిబ్బంది లెక్కిస్తున్నారు.
తొలుత పోస్టల్ బ్యాలెట్లు..
తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ఓట్లు లెక్కించారు. తర్వాత బ్యాలెట్ పెట్టెల్లోని ఓట్లను 25 చొప్పున కట్టలు కడతారు. తర్వాత డ్రమ్ములో తిప్పి ఒక్కో టేబుల్‌కు 40 కట్టలు.. అంటే వెయ్యి ఓట్లు కేటాయిస్తారు. ఒక డివిజన్/వార్డు పూర్తయ్యాక రెండో డివిజన్/ వార్డులో ఓట్లు లెక్కిస్తారు. టేబుళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటే ఒకేసారి రెండు, మూడు డివిజన్లు/ వార్డుల ఓట్లు లెక్కిస్తారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు, 1,345 మంది ఎస్‌ఐలు, 17,292 మంది కానిస్టేబుళ్లు, ఇతర భద్రత సిబ్బంది మరో 1,134 మందిని ఏర్పాటు చేస్తున్నారు. లెక్కింపు కేంద్రాల్లో 144 సెక్షన్ విధించారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం