రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరింది. ఒక్క విశాఖలోనే 6 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో అధికారులు లాక్‌డౌన్‌ను సమర్థంగానే అమలు చేస్తున్నా.. మరో 2 కేసుల నమోదుతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్తగా ఉదయం 6 నుంచి 11 గంటల వరకు నిర్ణయించిన నిత్యావసరాల కొనుగోలు సమయాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకు తగ్గట్లే పటిష్ఠ ఏర్పాట్లుచేశారు. అయితే ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం, కందిపప్పు, పంచదారను ప్రజలు చౌక ధరల దుకాణం నుంచి పొందుతున్నారు.
నిరంతర నిఘా
నగరంలో కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన జీవీఎంసీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది... పలు ప్రాంతాల్లో రసాయనంతో పిచికారి చేశారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో... శానిటైజర్లతో శుభ్రపరుస్తున్నారు. పనులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. వైద్య పర్యవేక్షణలో ఉంటూ నెగిటివ్ వచ్చిన 86 మందిని ఇళ్లకు పంపి క్వారంటైన్ కొనగించేలా చర్యలు తీసుకున్నారు. విదేశాల నుంచి వచ్చి స్వీయనిర్బంధంలో ఉన్నవారిపైనా నిఘా కొనసాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అవసరమైన మాస్కులను అధికారులు ఏర్పాటుచేస్తున్నారు. కరోనా వ్యాప్తి నిరోధన చర్యల కోసం కలెక్టర్ వినయ్ చంద్ నేతృత్వంలో 21 కమిటీలు పనిచేస్తున్నాయి.
గ్రామాలపైనా దృష్టి
లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లే రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారాన్ని ఆరా తీస్తున్నారు. పోలీసులు గ్రామీణ ప్రాంతాలపైనా దృష్టిసారించారు.
ఇదీ చదవండి : 'లాక్'డౌన్: మేం బతకడం ఎలా..?