విశాఖ ఉక్కు కర్మాగారంలో మరో కోక్ ఓవెన్ బ్యాటరీ పనులు ప్రారంభించింది. ఈ తరహా కోక్ ఓవెన్ బ్యాటరీలలో ఇది 5వది. దీనిని సోమవారం ఉదయం ఛార్జీ చేయగా సిద్దమైన కొక్ ఇవాళ బయటకు రావడంతో బ్యాటరీ పని ఆరంభమైనట్టు ఉక్కు సీఎండీ పికె రథ్ ప్రకటించారు. దీని కింద ఉన్న 67 ఓవెన్లు ఒకేసారి 24 గంటల్లో ఛార్జింగ్ చేయడం దీని ప్రత్యేకత.
ఈ కోక్ ఓవెన్ బ్యాటరీ-5 ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 2500 కోట్లు. ఇప్పటికే ఈ తరహా బ్యాటరీలు నాలుగు పని చేస్తున్నాయి. ఉక్కు ఉత్పత్తికి అవసరమైన కోక్ ఇందులో సిద్దమవుతుంది. ఉక్కు కర్మాగారంలో ఇదో మైలురాయిగా ఉక్కు సీఎండీ పికె రథ్ అన్నారు. ఈ సందర్భంగా ఉక్కు ఉద్యోగులను అభినందించారు.
ఈ ప్రాజెక్టు ప్రధాన సలహాదారుగా మెకాన్ సంస్థ, ప్రధాన కాంట్రాక్టర్లుగా బీఈసీ కన్సార్టియం, టాటా ప్రాజెక్ట్స్ సంస్ధలు వ్యవహరించాయి. కార్యక్రమానికి ఈ బ్యాటరీ నిర్మాణ, నిర్వహణ సంస్ధ మెకాన్ సీఎండీ అతుల్ భట్ సహా, ఉక్కు ఉన్నతాధికారులు, మెకాన్ ఉన్నతాధికారులు, యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: కొవిడ్ సెకండ్ వేవ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి: సీఎం జగన్