రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం పాటుపడుతోందని కేంద్ర విదేశాంగ, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ అన్నారు. విశాఖ నిర్వహించిన పధాదికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన..అవినీతి లేని సుస్థిర పాలనే తమ ధ్యేయమని అన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని.., కేంద్రం దీనిని నిశితంగా గమనిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భాజపా బలపడుతోందని.. గతంలో కంటే మెరుగైన పనితీరు కనబరుస్తోందని అన్నారు.
గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి
భాజపా యువనేత లోకుల గాంధీ ఏ ఆశయం కోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా శ్రమించాడో దానిని నెరవేర్చేందుకు మనమంతా కృషి చేయాలని కేంద్ర మంత్రి వి. మురళీధరన్ అన్నారు. విశాఖ జిల్లా శరభన్నపాలెంలో నిర్వహించిన గాంధీ సంతాపసభలో పాల్గొన్న మంత్రి.. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న లోకుల గాంధీ మరణం భాజపా తీరని లోటని అన్నారు. గాంధీ కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
గిరిజన సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన లోకుల గాంధీ మృతి..గిరిజన సమాజానికి తీరని లోటని భాజపా సహ్ సంఘటన్ జాయింట్ సెక్రటరీ శివప్రకాశ్ జీ అన్నారు. ఈ సంతాప సభలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి స్ఫూర్తిగా ముందుకు నడవాలి
సంతాప సభ కార్యక్రమం అనంతరం కృష్ణాదేవిపేటలో అల్లూరి స్మారక పార్కును కేంద్ర మంత్రి మురళీధరన్ సందర్శించారు. జాతి గర్వించదగ్గ స్వాతంత్య్ర సమరయోధుల్లో అల్లూరికి ప్రత్యేక స్థానం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అల్లూరి చరిత్ర భావితరాలకు తెలిసేలా ఆయన నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. మన్యం పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిగా యువత ముందుకు నడవాలన్నారు.
ఇదీ చదవండి
Purandeswari: రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: పురందేశ్వరి