విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. విశాఖ ఉక్కుతోపాటు అనుబంధ పరిశ్రమల్లో 100 శాతం వాటా విక్రయానికి ఈనెల 28 వరకు బిడ్లు దాఖలుకు అవకాశం ఇచ్చింది. 29వ తేదీన సాంకేతిక బిడ్లను తెరవనున్నట్లు తెలిపింది. ప్రైవేటీకరణ ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు న్యాయ సలహాదారు నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది.
జనవరిలో కేబినెట్ అప్రూవల్ కమిటీ అంగీకరించిన విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం ప్రభుత్వ వాటా విక్రయానికి శరవేగంగా చర్యలు చేపడుతోంది. ఈమేరకు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ-దీపమ్.. వాటా విక్రయంపై నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ప్రైవేటీకరణ ఈ నిర్ణయంపై వెనుకడుగు లేదని కేంద్రం స్పష్టత ఇచ్చింది. వాటా కొనుగోలుకు సంబంధించి బిడ్డర్లు తమ బిడ్లను సమర్పించే ప్రక్రియ షెడ్యూల్, అర్హతలు, విధి విధానాలను ప్రకటించింది. బుధవారం నుంచి బిడ్ ఆఫర్లు ప్రారంభమవగా.. ఈ నెల 28న బిడ్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించింది. ఈ నెల 29న సాంకేతిక బిడ్లు తెరవనున్నారు. అనుబంధ ఉత్పత్తులు తయారుచేసే కొన్ని సంస్థల్లోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ భాగస్వామిగా ఉంది. అందులోని వాటాలనూ వంద శాతం విక్రయించేందుకు వీలుగా చర్యలు తీసుకోనున్నారు.
ప్రైవేటీకరణను నిరసిస్తూ 'విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు' నినాదంతో.. స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగులు, కార్మిక సంఘాలు కొన్ని నెలలుగా నిరసన దీక్షలు చేస్తున్నాయి. ఇవేమీ పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం.. అనుకున్న విధంగానే ప్రైవేటీకరణపై ముందుకు వెళుతోంది.
ఇదీ చదవండి:
CM JAGAN TOUR: రేపు వైఎస్ఆర్ జయంతి..ఇడుపులపాయకు సీఎం జగన్