విశాఖ జిల్లా మాధవవరం, మర్రిపాలెం ప్రాంతాల్లో ఉన్న అశోక్ నగర్, హుస్సేన్‌నగర్ కాలనీల్లో తెల్లవారుజామున దొంగలు పడ్డారు. ఇళ్ల తాళాలను పగలగొట్టి బంగారం, నగదు అపహరించారు.
బంధువుల ఇంటికి వెళ్లొచ్చేసరికి..
అశోక్ నగర్లో నివాసముంటున్న ఎం.వీరబాబు నేవల్ బేస్‌లోని అగ్నిమాపక దళంలో పని చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి మాధవధార వుడాకాలనీలో నివాసం ఉంటున్న బంధువుల ఇంటి వద్ద తన భార్యని దించి విధులకు హాజరయ్యాడు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా సామగ్రి చిందరవందరగా పడేసి ఉన్నాయి. ఎనిమిది తులాల బంగారం, రెండు తులాల వెండి, రూ.10వేలు నగదు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు.
గృహ ప్రవేశానికి వెళ్లి వచ్చే లోపు..
హుస్సేన్ నగర్‌కు చెందిన సన్యాసినాయుడు ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నవాల్తేరులో ఉంటున్న బంధువుల గృహ ప్రవేశానికి శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా దుస్తులు చిందరవందరగా ఉన్నాయి. మూడు తులాల బంగారం వస్తువులు, రూ.10 వేల నగదు దొంగలించినట్లు ఆయన తెలిపారు. అదే వీధిలో నివాసం ఉంటున్న ఆంజనేయులు డాక్ యార్డ్ ఉద్యోగి. అతను లేకపోవడంతో స్థానికులు.. ఆంజనేయులుకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.
స్వగ్రామం యలమంచిలి వెళ్లినట్లు చెప్పడంతో వెంటనే రావాలని పోలీసులు సూచించారు. 6 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.2.50 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశాడు. క్రైం సీఐ లూథర్ బాబు, ఎస్సైలు కాంతారావు, సుదర్శనరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంతో మూడు ఇళ్లల్లో వివరాలు సేకరించారు. చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.
ఇదీ చదవండి:
sexual harassment: బాబాయి అత్యాచారం.. సోదరుడి లైంగిక వేధింపులు.. యువతి బలవన్మరణం