విశాఖ జిల్లా పెడగంట్యాడలో వెంకటరావు అనే వ్యక్తి... పోర్టులో ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగరీత్యా అనేకసార్లు దుబాయ్‌కి వెళ్లారు. అక్కడే రహదారుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అక్కడి ట్రాఫిక్ వ్యవస్థను... రహదారుల నిర్మాణాలను క్షుణ్నంగా పరిశీలించారు. అప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. తనకున్న అవగాహనతో... రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి స్వదేశానికి తిరిగివచ్చారు.
1996 నుంచి రాష్ట్రంలోని వివిధ రహదారులపై అనేక పరిశోధనలు చేశారు. ప్రమాదాలు జరగడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఆ వెంటనే తన పని మొదలుపెట్టారు. రోడ్డుపై ఎలా ప్రయాణం చేయాలి... మలుపులు ఎలా తిరగాలి... రోడ్డు దాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... ఇలా ప్రతీ అంశాన్ని తెలిపేలా చిత్రాలు గీశారు. కొన్నింటికి యానిమేషన్ చిత్రాలు రూపొందించారు. వాటితో ప్రమాదాలను చాలావరకు తగ్గించవచ్చని వివరించారు.
ప్రభుత్వం సాయమందిస్తే 200పైగా యానిమేషన్ చిత్రాలను సీడీలో పొందుపరుస్తాననీ... వాటిని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అందిస్తే ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు వెంకటరావు. ప్రస్తుతం తన ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి అవసరమయ్యే ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
రోడ్డు ప్రమాదం జరిగితే అయ్యో పాపం అని అనుకోవడం కాకుండా... ఐదు పదుల వయసులో ప్రమాదాల నిర్మూలన దిశగా కృషి చేస్తున్న వెంకటరావు ప్రయాణం ఆదర్శనీయం.
ఇవీ చదవండి..