నిరక్షరాస్యులు, పేద వారిని లక్ష్యంగా చేసుకుని ఓ ముఠా విశాఖ జిల్లా గాజువాకలో నయా మోసానికి తెరలేపింది. ఆర్థికంగా వెనుకబడిన ప్రజలు ఎక్కువగా ఉండే గాజువాక ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారికి రూ. 500 చెల్లిస్తామని ప్రచారం చేశారు. నగదు ఉచితంగా వస్తుందని ఆశపడి స్థానిక మహిళలు వారి మాయమాటలు నమ్మారు.
ఈ ముఠా ప్రజల నుంచి అధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు సేకరించి.. వారి వేలిముద్రలను తీసుకుంటున్నారు. దీనిని గమనించిన కొందరు స్థానిక యువకులు అనుమానం వచ్చి ప్రశ్నించగడంతో ముఠాలోని ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల్లో పట్టుబడిన ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి న్యూ పోర్టు పోలీసులకు సమాచారం అందించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలుకోణాల్లో ప్రశ్నిస్తున్నారు. అసలు వారు ప్రజల నుంచి ఆధార్, పాన్ వివరాలను ఎందుకు సేకరిస్తున్నారు..? వీటితో వారికి పనేంటి..? వాటిని దుర్వినియోగ పరిచేందుకు వాడబోతున్నారా..? వారి పేరు మీద అక్రమంగా సిమ్ కార్డులు తీసుకునేందుకు ఇలా చేస్తున్నారా..? లేదా ఏదైనా సైబర్ నేరాలకు పాల్పడడానికి, అక్రమ లావాదేవీలు చేయడానికి ఈ వివరాలను వినియోగిస్తారా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన మరో ఇద్దరు నిందితులను పట్టుకుని ప్రశ్నిస్తే దీనిలో అసలు వాస్తవాలు బయటపడే అవకాశముంది.
ఇవీ చదవండి: