ZP CHAIRMAN: కొలువుదీరిన కొత్త జడ్పీ ఛైర్మన్లు.. వివరాలిలా.. - ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ ఎన్నికలు
జిల్లాలకు కొత్త జడ్పీ ఛైర్మన్లు ఎవరు..? అనే ఉత్కంఠకు తెరపడింది. మారిన సమీకరణాలు, పార్టీల గెలుపు వ్యూహాలతో ఎట్టకేలకు నూతన జడ్పీ ఛైర్మన్లు కొలువుదీరారు. జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక పూర్తైంది. 13 జిల్లాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
విశాఖ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా జల్లిపల్లి సుభద్ర, వైస్ ఛైర్‌పర్సన్‌గా భిసెట్టి వరాహ సత్యవతి, మరో వైస్ ఛైర్మన్‌గా తుంపాల అప్పారావు ప్రమాణస్వీకారం చేశారు. శ్రీకాకుళం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పిరియా విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయనగరం జడ్పీ ఛైర్మన్‌గా మజ్జి శ్రీనివాసరావుతో కలెక్టర్ ప్రమాణం చేయించారు. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఛైర్మ్‌గా పి.గన్నవరం జడ్పీటీసీ విప్పర్తి వేణుగోపాల్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రులు కన్నబాబు, పినిపే విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ కార్యక్రమానికి హాజరయ్యారు.
కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా ఉప్పాల హారిక ప్రమాణ చేయగా కార్యక్రమానికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని హాజరయ్యారు. ఉప్పాల హారిక అనుచరులతో భారీ ర్యాలీగా మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయానికి వచ్చారు. ఈక్రమంలో అందరినీ పోలీసులు అనుమతించకుండా గేట్లు వేయగా వైకాపా శ్రేణులు బలవంతంగా తోసుకుని లోపలికి వెళ్లారు. తోపులాటలో కొందరు పోలీసులు కిందపడ్డారు.
గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కత్తెర క్రిస్టినా, డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా బత్తుల అనురాధ, మరో వైస్ ఛైర్మన్‌గా శొంఠిరెడ్డి నర్సిరెడ్డి ఎన్నికయ్యారు. ప్రత్తిపాడు జడ్పీటీసీ విప్పాల కృష్ణారెడ్డి ప్రమాణస్వీకారానికి గుర్రంపై ఊరేగింపుగా వచ్చారు. ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా బూచేపల్లి వెంకాయమ్మ, వైస్ ఛైర్‌పర్సన్‌లుగా అరుణ, సుగుణమ్మను ఎన్నుకున్నారు. మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీ మాగుంట కార్యక్రమానికి హాజరయ్యారు. నెల్లూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఆనం అరుణమ్మ ఎన్నికవగా మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, అనిల్‌కుమార్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతపురం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన బోయ గిరిజమ్మతో కలెక్టర్ ప్రమాణం చేయించారు. కడప జడ్పీ ఛైర్మన్‌గా ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు జడ్పీ ఛైర్మన్‌గా వి.శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇవీచదవండి.