వైఎస్సార్ జగనన్న కాలనీల పథకం కింద ప్రభుత్వం పేదలకు నిర్మించి ఇవ్వనున్న ఇంటి నిర్మాణ డిజైన్‌ను మార్చాలని క్షేత్రస్థాయిలో గృహనిర్మాణశాఖ అధికారులను లబ్ధిదారులు కోరుతున్నారు. ప్రతిపాదిత డిజైన్ మేరకు ప్రతి కాలనీలోనూ ఒక నమూనా గృహాన్ని అధికారులు నిర్మిస్తున్నారు. మరోవైపు లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం ఆప్షన్లను తీసుకుంటోంది. ఈ సందర్భంగా లబ్ధిదారులు డిజైన్ మార్చాలని విన్నవిస్తున్నారు.
ప్రభుత్వ ప్రతిపాదిత నమూనాలో ఇంటితో కలిపి మరుగుదొడ్డి ఉండేలా అధికారులు డిజైన్‌ను రూపొందించారు. ఇంటి ప్రధాన గుమ్మం, మరుగుదొడ్డి తలుపులు పక్క పక్కన వచ్చేలా తయారు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇంటితోపాటు మరుగుదొడ్డి కలిసి ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విడిగా ఏర్పాటుచేయాలని వారు కోరుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిర్మించే ఇళ్లకు మరుగుదొడ్డి తలుపులు ప్రధాన గుమ్మానికి పక్కగా బయటికి ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
3 గుమ్మాలపై సెంటిమెంట్....
ఇంటికి మూడు వాకిళ్లు (గుమ్మాలు) ఉండకూడదని రాయలసీమ వాసులు భావిస్తారు. ఆ మేరకు సీమ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరులలో ప్రభుత్వ డిజైన్‌పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు లేదా నాలుగు వాకిళ్లు ఏర్పాటు చేసినా తమకు అభ్యంతరం లేదని వారు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి గృహనిర్మాణశాఖ సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులకు అధికారుల దృష్టికి ఈ సమస్యలను జిల్లా అధికారులు తీసుకువచ్చారు. దీనిపై చర్చించిన అనంతరం ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం పొందిన డిజైన్ ప్రకారమే నిర్మాణాలు కొనసాగుతాయని ఉన్నతాధికారులు ఆ సమావేశంలో స్పష్టం చేశారు.
ఇదీచదవండి