Weather Alert: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరోమారు క్రియాశీలకంగా మారాయి. దీంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతం నుంచి వివిధ ప్రాంతాలపై ఉపరితల ద్రోణి కూడా ఆవరించి ఉండటంతో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, రాజస్థాన్, అస్సాం, మేఘాలయ, మధ్యప్రదేశ్ తో పాటు హిమాలయ పర్వత ప్రాంతాల్లోనూ కుండపోత వానలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తంజావూరులో గరిష్టంగా 17 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. రాష్ట్రంలోని అద్దంకిలో 10 సెంటిమీటర్ల వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, ఒడిశాలో.. వచ్చే 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలియజేసింది.
విజయవాడలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది. వాన జోరుతో నగరంలో రోడ్లు జలమయమయ్యాయి. బాగా రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వర్షపు నీళ్లు నిలిచాయి. అలాగే బందర్ రోడ్డులో చాలాచోట్ల నీళ్లు నిలవడం వల్ల.. వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో మురుగునీటి కాల్వలు పొంగడంతో.. రోడ్లపైకి మురుగునీరు వచ్చింది. వాన తగ్గిన తర్వాత రోడ్లపై చేరిన నీళ్లు తోడేయడం తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని నగర వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నగర శివార్లలోని నందమూరి నగర్లో మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాలనీలో రోడ్లు సరిగా లేకపోవడం వల్ల... వర్షాకాలంలో అల్లాడిపోతున్నామని చెబుతున్నారు.
ఇవీ చదవండి: