Water Release for Krishna Delta: ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి కృష్ణా డెల్టాకు మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్, మేరుగ నాగార్జున సాగునీటిని విడుదల చేశారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు, పశ్చిమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. తొలుత 1500 క్యూసెక్కులు విడుదల చేసి.. సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలను పెంచనున్నట్లు తెలిపారు. కృష్ణా డెల్టా పరిధిలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నీటిపారుదల సలహా మండలి తీర్మానాల ప్రకారం ఖరీఫ్‌కు సంబంధించి ఈ ఏడాది ముందుగానే నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా తూర్పు డెల్టాకు 100.38 టీఎంసీలు, కృష్ణా పశ్చిమ డెల్టాకు 69.89 టీఎంసీల నీరు అవసరం అవుతుందని జలవనరులశాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు ముందుగా నీరు విడుదల చేయటం వల్ల నవంబరు చివరి నాటికి వరికోతలు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది అనుకున్న సమయం కంటే ముందుగానే సాగుకు నీరు ఇస్తున్నామని.. రెండో పంటతోపాటు మూడో పంటకు కూడా అవకాశాన్ని బట్టి నీటిని అందిస్తామని మంత్రి అంబటి తెలిపారు. వేసవిలో జలాశయాల్లో ఉండాల్సిన దానికంటే నీటిమట్టం ఎక్కువగానే ఉందని చెప్పారు. రుతుపవనాల ప్రభావంతో సకాలంలో మంచి వర్షాలు కురుస్తాయనే ఆశాభావంతో ఉన్నామని అన్నారు. సీఐడీ అధికారులకు మాజీ మంత్రి దేవినేని ఉమ చేసిన ఫిర్యాదుపై మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి అంబటి వ్యంగ్యంగా బదులిచ్చారు. తప్పుడు కేసులు పెడితే ఆ తర్వాత పర్యవసనాలకు కూడా సిద్ధం కావాలన్నారు.
ఇవీ చూడండి