మార్చిలో కొవిడ్ ప్రభావంతో ప్రజలను నిర్బంధించిన లాక్‌డౌన్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ పనులతో పాటు వ్యాయామానికి, ప్రకృతి ఒడిలో సేదదీరడానికి ప్రజలు ముందుకొస్తున్నారు. విశాఖలోని అనేక ఉద్యానవనాలు.. ఉదయం నడక, యోగా కోసం వచ్చేవారితో... సందడిగా కనిపిస్తున్నాయి. కైలాసగిరి కొండ దిగువ ప్రాంతంలో పచ్చదనం మధ్య రమణీయ దృశ్యకాంతులతో ఉండే హెల్త్ ఎరెనాలో కోలాహలం ఇంకాస్త ఎక్కువగా ఉంది. ఎటుచూసినా ఆరోగ్యం, ఆనందాన్ని కాపాడుకునేలా కసరత్తులు చేశారు.
మనసుకు శాంతి, సాంత్వన చేకూరాలంటే.. ప్రకృతికి చేరువగా ఉండడం తప్పనిసరంటున్నారు విశాఖవాసులు. ఇన్నాళ్లు ఇళ్లకు పరిమితమై డిజిటల్ తెరలపై ప్రపంచాన్ని చూస్తున్న చిన్నారులు.. ప్రకృతి బాటలో వ్యాయామం చేస్తున్నారు.
కొవిడ్ భయంతో ఇళ్లలోనే ఉంటే.. ఆ ప్రభావం మానసిక ఆరోగ్యంపై ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తలు పాటిస్తూ.. మనసు, శరీరానికి ఉత్సాహాన్నిచ్చే వ్యాయామాలు తప్పనిసరని భావిస్తున్నామని చెబుతున్నారు.
పార్కుల్లో చేస్తున్న ఆసనాలు, లాఫింగ్ థెరఫీ వంటివి.... చూపరుల్లోనూ ఉత్సాహం నింపుతున్నాయి.
ఇదీ చదవండి: ఉపకులపతుల నియామక దస్త్రం వెనక్కి పంపిన గవర్నర్ కార్యాలయం