Vinayaka Chaturthi Celebrations: వినాయక చవితికి ప్రకాశం జిల్లాలో ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత రెండేళ్ళుగా వినాయక చవితి అంతగా జరుపుకోని భక్తులు ఈ సారి అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మార్కెట్‌లో వినాయక విగ్రహాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రతి వీధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఒంగోలులో ఫ్రీడం బర్డ్స్ అనే సంస్థ నిర్వహించిన పోటీల్లో పలు పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరై విభిన్న ఆకారాల్లో వినాయకుడు ప్రతిమలను తయారు చేశారు.
నెల్లూరులో వినాయక ఉత్సవాలకు ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు. నగరంలో 200కుపైగా విగ్రహాలను ఏర్పాటు చేస్తారనే అంచనాతో.. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కోసం ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వద్ద చెరువులో ఏర్పాట్లు చేశారు. నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని పోలీసులు సూచించారు. పర్యావరణానికి హాని చేయని మట్టి వినాయకుడినే ప్రతి ఇంట్లో పూజించాలంటూ తెలుగుదేశం ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఏడు రోడ్లు కూడలిలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవితో కలిసి మట్టి గణపతి విగ్రహాలను స్థానికులకు పంపిణీ చేశారు.
కడప అక్కయ్యపల్లె వాసులు 54 అడుగుల పర్యావరణ వినాయకుడి ప్రతిమను తయారుచేశారు. 250 మీటర్ల గోనె సంచి, వరి పొట్టు, 650 కిలోల బంక మట్టితో40 రోజులపాటు శ్రమించి ప్రతిమను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామలో పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఏలూరులో తెలుగుదేశం నేతలు పది వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. కాలుష్య రహిత మట్టి విగ్రహాలతోనే వేడుకలు నిర్వహించుకోవాలని నేతలు సూచించారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం మట్టి వినాయక విగ్రహాలు తయారీ పోటీ నిర్వహించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ముస్లిం నేతలు స్థానికులకు వినాయక విగ్రహాలు పంపిణీ చేసి మతసామరస్యాన్ని చాటారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో గణేష్ విగ్రహాల అమ్మకాల సందడి నెలకొంది.
వినాయక చవితి పురష్కరించుకొని మార్కెట్లు నూతన కళను సంతరించుకున్నాయి. మహిళలు, చిన్నారులతో కళకళలాడాయి. ఏడాదికోసారి జరిగే గణనాథుని ఉత్సవాలను యువత ఛాలెంజ్‌గా తీసుకొని నిర్వహిస్తారు. గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి కారణంగా ఉత్సవాలు జరపలేని పరిస్థతుల నుంచి బయట పడ్డ ప్రజలు ఈ ఏడాది ఘనంగా జరపడానికి సిద్దమవుతున్నారు. గత రెండేళ్లు వ్యాపారాలు లేక తీవ్ర ఆర్థికంగా ఇబ్బందులు పడిన చిరు వ్యాపారులు ఈ ఏడాది మార్కెట్లు పుంజుకోవడంతో ఉపశమనం పొందారు. విజయవాడలో ఎక్కడ చూసినా జనాలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. నగరంలోని పూల మార్కెట్ జనాలతో కిటికిటలాడింది. వినాయకుని విగ్రహాలు, పూలు, పళ్లు, అలంకరణ సామగ్రి కోసం జనం ఎగబడ్డారు.
ఇవీ చదవండి:
- ఈ ఏడాది పంచముఖ మహా లక్ష్మీగణపతిగా.. ఖైరతాబాద్ గణేశ్
- బస్సులో కోబ్రా హల్చల్.. భయంతో జనం పరుగో పరుగు.. ఇంతలో
- లేత మెరుపు చీరల్లో ఈ బాలీవుడ్ భామల సోయగాలు అదుర్స్